పుంజీతం కథలు-విశ్లేషణ

పల్లె విధ్వంసం మీద "పుంజీతం"

పల్లె అంటేనే వ్యవసాయం .వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే కూలీలు.మొత్తంగా ఒక శ్రమజీవన సంస్కృతి. మనకు తెలియకుండానే ప్రపంచీకరణ అనేక రూపాలలో ఊర్లలోకి చొరబడింది.ప్రపంచీకరణ తరువాత గ్రామీణుల జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?ఎంతో అభివృద్ధి సాధించినాము అని చెప్పుకున్నప్పటికీ రైతుల,చేనేతల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు?
ఇప్పుడు వీటికి సమాధానాలు వెతుక్కోవలసిన అవసరం వుంది.దేశ అభివృద్ధినైనా,ఔనత్యాన్ని అయినా గ్రామం నుంచే కొలవాలి.రాజ్యం తీరు గురించి ఏదైనా తీర్పిస్తే అది సామాన్యుడే మాట్లాడి తీరాలి. ఇటువంటి సందర్భంలో పల్లెల్లో ఎదుర్కొంటున్న సమస్యలు,వాళ్ళ జీవనవిధానం తెలిపుతూ ఆధునిక పల్లె స్వరూపాన్ని చిత్రించిన కథలు వెల్దండి శ్రీధర్ రాసిన "పుంజీతం"కథలు.

పుంజీతంలోని 12కథల్లో ఎక్కువభాగం గ్రామీణనేపథ్యంలోంచి పుట్టినవే.ఇవి శ్రామిక జీవనాన్ని తెలపడమే గాక గ్రామీణబతుకులు విచ్ఛిన్నం కావడానికి కారణాలను వెతికి చూపించిన కథలు.గ్రామీణజీవితాలనే వస్తువుగా తీసుకున్నప్పటికీ కథను నడిపించిన విధానం,ఒక్కొక్క కథలో వేరువేరు జీవనచిత్రణల వలన వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి.వాటిల్లో "సజీవదహనం" కథ ఇప్పటి పేద రైతుల జీవితాన్ని కండ్లముందుంచుతుంది.ఈ కథలో బూదవ్వ,అయిలయ్య భార్యభర్తలు.ఎంతో అప్పుజేసి బిడ్డకు పెండ్లి చేస్తే కట్నం కావాలని అల్లుడు తన బిడ్డను ఇంటికి పంపిస్తాడు.ఈ సారి పంటపండితే ఇక అప్పులు తీరుతాయని ఆశపడ్డరైతుకు కన్నీళ్ళే మిగిలాయి.వరికోత సమయానికి కరెంటు సరిగ్గా లేక,నీళ్ళ రాక పంట ఎండిపోతుంది.ఎండిపోయిన పంటను జూసిన అయిలయ్య పంటకు నిప్పంటించి ఒకవైపు పెరిగిన అప్పులను,కట్నం కోసం ఇంటికొచ్చిన బిడ్డను ఙ్ఞాపకం చేసుకొని మంటల్లో దూకడం "సజీవదహనం"లోని కథ.
ఇప్పుడు అయిలయ్యది ఆత్మహత్య అందామా?హత్య అందామా?రైతులకు నీళ్ళివ్వని ప్రభుత్వాలు కారణమందామా?అయిలయ్య లాంటి రైతులను  మంటల్లోకి తోస్తున్న వరకట్న సమస్యను తిడుదామా?
సజీవదహనం కథ చదివిన తరువాత మనల్ని వెంటాడే ప్రశ్నలివి. బోర్లు వేసి అప్పుల పాలై చనిపోతున్న రైతులదీనస్థితిని చూపించాడు రచయిత."సర్కారోడు ఒక్క బియ్యమిత్తే అయిపాయెనా?ఎన్ని గావాలె ముద్ద నోట్లెకు పోవాల్నంటే?నూనె పాకెట్ కు ఎనభై రూపాయలు,పప్పు కొంటె అరవై రూపాయలు...."ఈ మాటలను బూదవ్వ పాత్ర చేత చెప్పించి ప్రభుత్వవైఖరిని ఎండగడుతడు రచయిత. కొన్నింటి మీద ధరలు తగ్గించి మిగతావాటి ధరలను పెంచడం వెనుక ఎంత కపటపూరిత విధానం ఉందో పసిగట్టగలం.

ప్రభుత్వసంక్షేమ పథకాలైన రేషన్ బియ్యం,ఆసరా పింఛన్ లాంటివి చేరవలసిన వారికి చేరకుండా పోవడం,ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉన్న రేషన్ కార్డు తీసివేయడం వలన ఆకలితో మరణించిన చంద్రవ్వ లాంటి ఎంతో మంది ముసలివాళ్ళ జీవితవిషాదాన్ని "ఆరుద్రపురుగు"కథలో చూపించాడు. "గుడిసున్న దానికేమో కోపను కారటు ఊడగొట్టిండు.మిద్దెలున్నోళ్లకేమో తెల్ల కారటిచ్చిండు...అదే..మేమేం పాపం జేసినం?వీని రాజ్యంల మన్నువడ "అని కుటుంబ వివరాలు రాసుకపోవడానికి వచ్చిన అధికారతో చంద్రవ్వ అన్న మాటలు ఎంతో మంది ముసలివాళ్ళ గోసను ఆవిష్కరిస్తూనే ఇప్పటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తాయి. ఆసరా ఫించన్ లాంటి పథకాలు గొప్ప సంకల్పంతో మొదలైనా మధ్యలో ఉన్న అధికారుల అవినీతి వలన చేరవలసిన వారికి చేరడం లేదనేది సత్యం. ఫించన్ రావడానికి అర్హత ఉన్నా ఇవ్వకపోవడం,లేని వాళ్ళకు ఇవ్వడం, గ్రామంలోని రాజకీయాల వలన ప్రజలు ఇబ్బందులు పడడం మొదలైన వాస్తవంగ జరుగుతున్న విషయాలను చెప్పి ప్రభుత్వాల కండ్లు తెరిపిస్తుందీ కథ.

 "పుండు" కథ భర్తను పొగొట్టుకొని బతుకీడుస్తున్న నీలవేణి  జీవితం.ఈ కథలో ఊర్లలో,పట్టణాలలో వడ్డీ వ్యాపారం ఎలా సాగుతుందో చూపించింది.  ప్రజల అత్యవసరాలను ఆసరాగ చేసుకొని
జనం నాడి పట్టుకొని ఐదు,పది రూపాల వడ్డికి
అప్పిచ్చే కాబూలీ వడ్డి గురించి చెబుతూ
దుర్మార్గమైన వ్యవస్థను చూపించాడు రచయిత.
అప్పుతీసుకున్న వారి సొమ్మును,భూములను 
స్వంతం చేసుకొని వాళ్ళు రోడ్డున పడడానికి కారణమౌతున్నరు వడ్డీ వ్యాపారస్తులు.
"ఆపతి పడుతుందంటే పది రూపాయలు,పిండం అడ్డం తిరిగిందంటే ఇరవై రూపాయులు మిత్తి" అని నీలవేణి దీనంగా చెబుతున్నడు పేదల కష్టాలతో,కన్నీళ్ళతో ఆడుకుంటున్న వడ్డీదారులు వాళ్ళ జీవితాలను తొక్కి ఎదుగుతున్న క్రమాన్ని చూపించాడు.
ఈ కథలో కాశీ,రాజశేఖర్ అనే రెండు పరస్పర విభిన్నమైన పాత్రలు కనబడుతాయి. ఎక్కువ వడ్డీకి అప్పిచ్చి
జలగలా రక్తం పీల్చి తాగుతున్న చెడ్డవాళ్ళకు ప్రాతినిథ్యం రాజశేఖర్ అయితే నీలవేణి కష్టాలలో ఉందని మూడులక్షల రూపాయలిచ్చి ఆదుకున్న మంచిమనిషి కాశీ.సమాజంలో మంచి,చెడు ఏ విధంగా కలగలిసి ఉన్నాయో ఈ పాత్రల ద్వారా చూపించాడు రచయిత.ఇద్దరూ నీలవేణి చిన్నప్పటి మిత్రులే అయినప్పటికీ డబ్బు సంపాదనే తప్ప  మానవత్వం మరిచిన రాజశేఖర్ లాంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువ.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ భూములను కొని కంపెనీలను పెడుతున్నారో "పుంజీతం"కథ ద్వారా చూపించాడు.భూములను తక్కువ ధరకు కొని వాటినే వెంచర్లు గా ఏర్పాటు చేసి కోట్లను గడిస్తున్న వ్యవస్థ ఈ కథలో కనబడుతుంది.  రియల్ ఎస్టేట్ పులి పంజా విసిరి పల్లెను విధ్వంసం చేసిన తీరు చూస్తాము.
పొలం పంచాయితీ,కులాంతర వివాహానికి సంబంధించిన కథ "దడ్వత్ ".
అధికారయంత్రాంగం కూడా ధనమున్న వాళ్ళకి,కులగర్వంతో పెద్దరికం చలాయించే వాళ్ళ ప్రక్కనే ఎలా నిలబడుతుందో ఈ కథ చదివితే తెలుస్తుంది.దడ్వత్ అంతే పంచాయితీ పెట్టిన ఇరువర్గాలు కొంత సొమ్మును డిపాజిట్ కట్టడం."ధరావత్" పదమే  గ్రామాలలో దడ్వత్ గా మారింది.తీర్పు చెప్పె పెద్దమనుషులకు తిండి,తాగుడు ఏర్పాటు చేయడం కోసం
ఒక సామాన్యుడు ఎలా బలౌతున్నాడో కుమ్మరి  వీరమల్లు జీవితం ద్వారా అర్థమౌతుంది.
ఇప్పుడు గ్రామాలలో జరుగుతున్న పంచాయితీలను,వాటి వెనుక రాజకీయాలను అద్భుతంగ చూయించాడు రచయిత.
ప్రతాపరెడ్డి కొడుకు వీరమల్లు బిడ్డ కవితను లోబర్చుకొని మోసం చేస్తాడు.గర్భం వచ్చేసరికి పెండ్లి చేసుకోమంటే అస్సలు ఒప్పుకోడు.
ఈనాటికీ గ్రామాలలో  కులంవేళ్ళు లోలోపలికి బలంగా  పాతుకుపోయాయి.వీటి ద్వారా కింది కులం వాళ్ళు ఎలా అన్యాయమౌతున్నారో కవిత జీవితమే ఉదాహరణ.

చాలా కథల్లో రచయిత మానవతాదృక్పథం స్పష్టంగా అర్థమౌతుంది.ఆరుద్రపురుగు కథలో చంద్రవ్వ చనిపోతే ఊళ్ళోని వాళ్ళు,ఆ వూరి బడిపంతులు తమ వంతుగా ఆర్థికసహాయం చేసి చంద్రవ్వ చావుఖర్చును భరించడంలో సాటిమనిషిని ఆదుకోవాలనే మానవత్వం కనబడుతుంది."పుండు"కథలో నీలవేణి అప్పుల్లో ఉన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడైన కాశీ మూడులక్షల రూపాయలను చెక్కు  రూపంలో ఇవ్వడం గొప్ప మానవతదృక్పథం. "అమృతవర్షిణి " కథ రచయిత మానవతకు ,మనిషితత్వానికి అద్దం పడుతుంది.కొంతమంది చేతిలో మోసపోయిన స్థిమిత సమాజం మీద పగతో ఉండకుండ "ఎయిడ్స్ కేర్ హోం" స్థాపించడం  అందుకు ఉదాహరణ.మనిషి జన్మకు సార్థకత పరులను ఆదుకోవడంలోనే ఉందనే తత్వం వెల్దండి శ్రీధర్ కథలలో కనబడుతుంది.

శ్రీధర్ తన కథల్లో వస్తువుకు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ,శిల్పానికి అందే ప్రాధాన్యతనిస్తాడు.ప్రతి కథ యొక్క ముగింపు ఎలా ఉండబోతుందో కథాప్రారంభంలోనే ఒక సూచనప్రాయంగ దృశ్యం కల్పించి చెబుతారు.
కథమొత్తం చదివాక గాని మనకీ విషయం అర్థం కాదు. పుంజీతం కథ  పులిమేక ఆడుతున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణతో మొదలౌతుంది.ఎలాగైనా పులిని కట్టడి చేయాలని ఒక వ్యక్తి ప్రయత్నిస్తుంటే ఒక తెలియని వ్యక్తి ఆటలో జోక్యం చేసుకొని పులి మేకల్ని తినేటట్టు ఆడుతాడు. ఆ కొత్త వ్యక్తి గురించి "పులి మేక ఆట మీకు బాగా తెలిసినట్టుంది.మేకల వలయాన్ని ఒక్క దెబ్బకు చిత్తు చేశారు" అని ఆ గ్రామ సర్పంచ్ చేత చెప్పిస్తాడు రచయిత.ఆ కొత్త వ్యక్తే ఆ వూరిలోని భూములను కొనడానికి వస్తాడు.అతడు పేదల జీవితాల మీద ఎలా పంజా విసురుతాడో అతనిని ప్రవేశపెట్టడంలోనే తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారిని పులులుగ,భూములను అమ్ముకునే పేదలను మేకలుగ ప్రతీకగా చిత్రించి పుంజీతం కథ చెప్పడంలో రచయిత శిల్పసమన్వయం ఎంత గొప్పదో అర్థం చేసుకుంటాం.
పొక్కిలి కథ పిల్లలు ఆడుకునే అగ్గిపెట్టెగుగ్గిపెట్టె ఆటతో మొదలుపెడుతాడు.అరచేతిని బోర్లపెట్టి ఒక్కొక్క వేలును ముడుస్తూ ఈ ఆటను పిల్లలు ఆడుకుంటారు. వ్యవసాయం చేసే ప్రతీ రైతు బతుకనే ఆటలోంచి ఏ విధంగా తప్పిపోతున్నాడో ఈ ఆటను సమన్వయం చేస్తు చెప్పడం రచయిత సాధించిన గొప్ప శిల్పనైపుణ్యం.
వర్షాకాలంలో మాత్రమే కనబడే ఆరుద్రపురుగులను ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే రాజకీయనాయకులతో పోల్చీ "ఆరుద్రపురుగు"కథ నడిపించడంలో ఎంతో ఒడుపు కనబడుతుంది.

సజీవదహనం కథలో కలుపుపాటలు పాడుకునే స్త్రీలను,గ్రామీణ సంస్కృతిని చూయించాడు.
1)కలువ పోదాం వస్తరమ్మా
2)అయ్యజేసిన అప్పుకిందికి దొరోల్ల జీతగాడ
3)అక్క రాయె అక్కా రఘుమల్లెలో రామా
వరి నాట్లేసేటపుడు,కలుపు తీసేటపుడు స్త్రీలు పాడుకునే ఈ పాటలను ఒక్కొక్క సందర్భంలో పెట్టడం ద్వారా కథకు ఒక సజీవత్వం వచ్చింది.
గ్రామీణస్త్రీలు తమ కష్టాలను,సంతోషాలను ఈ పాటల ద్వారా చెప్పుకుంటారు.పాటలు పాడుతూ అలసటను మర్చిపోతారు.మధ్యమధ్యలో లోకం తీరు గురించి మాట్లాడుకునే సహజమైన సంభాషణలు,తెలంగాణ జీవభాష  ఈ కథకు మరింత బలం.
పల్లెను,వ్యవసాయాన్ని దగ్గరగా చూసి ఆ జీవితాన్ని గడిపిన రచయిత మాత్రమే ఇటువంటి కథ రాయగలడు అనిపిస్తుంది.

కథలో గ్రామీణులు మాట్లాడుకునే పదాలను వాడడం,సామెతలను వాడడం శిల్పంలో భాగంగానే చూడాలి.
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు,పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు,ఎంత పొర్లినా అంటినకాడికే  అంటినట్లు,లేకిడోని ఇంట్లనే శనేశ్వరుడు కూసుంటడన్నట్టు
మొదలైన ఎన్నో సామెతలు కథకు సహజత్వాన్ని తీసుకురావడమే గాక ఆయా పాత్రలకు ఎంతో బలాన్నిచేకూర్చాయి.
గ్రామీణ ప్రాంతాలలో జనవ్యవహారం నుండి జారిపోతున్న ఎన్నో పదాలను రచయిత ఆయా కథల్లో సందర్భానుసారంగా ఉపయోగించాడు.
నిఘంటువులకు ఎక్కని ఎన్నో పదాలు వీరి కథల్లో కనబడుతాయి.సవులతు,జౌవుడం(జగడం),సకులం ముకులం,ఎచ్చీర్కం,గజ్జుమనడం(భయం వేయడం),తక్లీబు (కష్టం),పుంజీతం(పులిజూదం -పులిమేక ఆట) మొదలైన ఎన్నో పదాలను శ్రీధర్ కథల్లోంచి ఎత్తిరాయోచ్చు.
కేవలం ఇవే గాక  గ్రామంలో ,ఆధునిక జీవితంలో ఎట్లాంటి మార్పులు వచ్చాయో తెలిపే  పదాలు కూడా ఉన్నాయి.వెంచర్  ,కార్టూన్ ఛానల్ ,లిఫ్టులు,స్క్వేర్ ఫీట్స్ ,ప్లాటులు,సోలార్ వాటర్ హీటర్ ,ఫ్రీ వైఫై లాంటి పదాలు ఆధునికజీవితాన్ని ప్రతిబింబిస్తాయి.

పుంజీతంలోని కథలన్ని పల్లెమీద మమకారంకొద్ది రాసినవి.మనిషికి మనిషికీ మధ్య దూరం పెరిగిన పల్లెల్ని చూసి  సంఘర్షణతో రాసినవి.ఒకే రోజు మూడు చేనేత కుటుంబాలు చితిపై కాలుతుంటే ఆవేదనతో రాసినవి.యువతదృష్టిలో  ఇప్పుడు ప్రేమంటే ఎలా మారిందో స్కాన్ చేసి చూపించినవి.
తెలంగాణ ఆత్మను పట్టించేవి.తెలంగాణ లో పల్లె ఎన్నెన్ని మార్పులకు గురౌతుందో,ఎంతమంది దళారుల చేతుల్లో బలౌతుందో మూలాలోకెళ్ళి రాసినవి.ప్రస్తుతం తెలంగాణ ఏ విధంగా ఉందో చెబుతూనే "బంగారు తెలంగాణ" ఏ విధంగా ఉండాలో కలగన్నవి.

-తగుళ్ళ గోపాల్ ,కలకొండ
9505056316

పుస్తకం వివరాలు
పుస్తకం పేరు:పుంజీతం(కథలు)
రచయిత:డా॥వెల్దండి శ్రీధర్ ,9866977741
వెల:రూ.100
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్ ,కాచిగూడ

Comments