వెయ్యేండ్ల మెదలుగల్గనీ...




















































వెయ్యేండ్ల మొదలుగల్గనీ..//తగుళ్ళ గోపాల్

అయ్యా...పెద్దసారూ
నీకు వెయ్యేండ్ల మొదలుగల్గనీ...

ఆడంగ వస్తున్నమంటేనే
మూసినదిలెక్క జూసి
దూరందూరం జరిగిన జనం
కరోనా పాపిష్టికాలంలో
చేరదీసే కరుణామయులెవరుంటరు?

ఇండ్లకు,మనసులకు
తలుపులు పెట్టుకొని కూసున్న లోకం ముందు
ధర్మం తల్లీ...అని కడుపుగొట్టుకుంటే
ఏడ నాల్గు మెతుకులు రాల్తయి?

ఈ నెల్లాల్లు
కాలు బయటపెట్టగూడదంటుండ్రు గదా
అట్టాగే అయ్యా...
మేము వెనకేసుకున్నదే తినమంటరా?
సూడుండ్రయ్యా మా సంపదనం
ఇగో..ఇవే..
గుట్టలుగుట్టలుగ పడివున్న చిత్తుకాగితాలు
ప్లాస్టిక్ కవర్లూ,ఖాళీసీసాలూ...

చేయిచేయి తగులకుంటా
దూరంజరిగి ఉండమంటున్నరు గదా
అగ్గిపెట్టంత గుడిసెలో
తల్లినల్గురం ఎట్లుందుము దేవా?

ఏ రోగమొచ్చినా
చేతులు నలుచుకోవడం దప్ప
కడుక్కోవడం తెలీనోళ్ళం
సబ్బునీళ్ళు ఎక్కడినుంచి వొస్తవి ప్రభూ?
ఒంటిమీద బట్టలేనోళ్ళం గదా
మూతికి బట్టెట్ట కట్టుకుందుము నాయినా?

నీడనిచ్చిన చెట్టు కూడా
కసిరిచ్చి పొమ్మంటుంది
చిల్లరపైసలేసిన బస్టాండేమో
పగవట్టిన పామైంది
మీ ఇండ్లకు పొమ్మంటున్నరు గదా
సస్తే ఆరడుగుల జాగ లేనోళ్ళం
ఎక్కడికి పోదుమయ్యా?

ఏ కార్డు లేనోళ్ళం
రోడ్డు మీద బతికి
రోడ్డు మీదనే పోయేటోళ్ళం
చిరిగిన మా బతుకుగుడ్డలను
ఎట్లా కుట్టుకోవాలో జెప్పి
పుణ్యం గట్టుకోండ్రి సారూ
మీకు వెయ్యేండ్ల మొదలుగల్గనీ...

25.3.2020
 —  Thagulla Gopal.









Comments