పల్లెజీవితం పల్లవించిన కవిత్వం : దండకడియం కవిత్వ సమీక్ష : శ్రీ మెట్టా నాగేశ్వర రావు

పల్లెజీవితం పల్లవించిన కవిత్వం

కవిత్వం రావడం లేదన్నప్పుడల్లా ఓ ఆశాకిరణంలా కొత్తకవి పుడుతూనే వుంటాడు. కవిత్వం పలుచబడి పోయిందన్నప్పుడల్లా చిక్కని కవిత్వం రాసి ఓ కొత్తకలం భరోసాగా నిలబడుతూనే వుంటది. కవులెపుడూ తయారు కారు. కాలమే కవుల్ని కంటది. కవిత్వమూ ఎపుడూ కాలిక అవసరంగానే పుడతది. అలా కాలం కన్న కవి, ఇప్పటి కాలానికి మూలాల మేలిమిని అందించే కవి ,యువకవి తగుళ్ళగోపాల్ . "ఒకచేత పుస్తకాలు, మరోచేత కట్టె వట్టుకుని పొద్దున,పొద్దూకి పసులు కాసిన చేతులతో, సెలవుల్లో కంకర మోసిన చేతులతో,పత్తి తీసిన చేతులతో అక్షరాల్ని దిద్దుకున్న నిఖార్సయిన పల్లెటూరికవి. తనెక్కడ కష్టపడి ఎదిగిండో, ఏ మట్టి మీద తాను తిరిగిండో ఆ "కలకొండ మట్టినుంచి" మనకు విలువైన కవిత్వగళాన్ని వినిపిస్తున్నాడు. ఆ గళాల సమాహారమే "దండకడియం" కవితాసంపుటి.
"తీరొక్క పువ్వు" నానీలతో కవితారంగ ప్రవేశం చేశాడు. ఇరవై అయిదక్షరాల తక్కువ జాగాలో నానీలు రాసి, అలరించాడు. "మా ఇంట్లో/దొంగలు పడ్డారు/ మా పేదరికాన్ని/ దోచుకపోతే బాగుండు" అంటాడు. " నాన్నగురించి /చెల్లితో ముచ్చట్లు/మా కబుర్లువింటూ/నాన్నఫోటో". నానీల్లోని పంచ్ ని తడిగా ఆవిష్కరించాడు. ఎన్ని పంక్తులు రాసామన్నది కాదు, ఎన్ని పంక్తుల్లో కవిత్వమున్నది అన్నదే ఈ కవి నినాదం. రెండో ప్రయత్నంగా వచనకవిత్వంలో అడుగు పెట్టాడు. గుండెలోని శ్వాసల్ని అక్షరాలుగా కూర్చి, దండకడియం గా పోతపోశాడు. పల్లెదృశ్యాలను, మట్టిలోని మమతను,మానవసంబంధాలను కవిత్వగంపలోకి ఎత్తుకుని తీసుకొచ్చాడు. వాటిలోని జీవిత వాస్తవికతను ,అభివ్యక్తి నైపుణ్యాన్ని, వస్తువైవిధ్యాన్ని ఇపుడు దర్శిద్దాం!

"రెండు మనసైన పదాలను/వేరు చేయడం ఏమంత గొప్ప/ఎల్లకాలం బతికేలా/ఏకవాక్యంగా దండగుచ్చడమే గొప్ప" అనే ఈ గోపాల్ కవిత్వం నిండా సజీవ వాక్యాలెన్నో వున్నాయి. ఎందుకంటే అతడు ఎంచుకున్న వస్తువులన్నీ ఆ సజీవత్వాన్ని సమకూర్చాయి. ఏ పల్లెకవి అయినా "నోస్టాల్జియా"కు గురికాకుండా రాయలేడు. గోపాల్ కూడా ఎన్నో వస్తువుల్ని బాల్యంలోంచి పట్టుకొచ్చాడు. గల్లగురిగి, గుంతగిన్నె, గంజి,ఈతసాప వీటితో పాటు "నాన్నగొడ్డలి". బరువైన గొడ్డలికి మానవీకరణ చేసి, అనుబంధాన్ని మనసు తడిచేలా చెప్పాడు. గొడ్డలితో పుల్లలు కొట్టి, ఏ తలుపు మూలనో పడేస్తాం. కానీ ఈ కవి దానిని అక్షరాలబండినెక్కించి, లోకానికి కనిపించేలా దాని పాత్రని వూరేగించాడు. కొన్ని పాదాలు చదవండి.
"నాన్న పిడికిట్లో కూర్చుని/నాన్న గుండెబాసలను విన్నది ఈ గొడ్డలే/మా నాన్నకు జిగిరిదోస్తు/మా ఇంట్లోని పేదరికాన్నంతా /కొంచెం కొంచెంగా నరుక్కుంటూ వచ్చింది"
పై పాదాల్లో గొడ్డలికి నాన్నతో వున్న అనుబంధాన్ని చెప్పాడు. "దీనికి జబ్బుజేస్తే/సాన్రాయి మీద మెత్తగా నూరి/ వైద్యం చేసేటోడు". ఇందులో గొడ్డలిపట్ల నాన్నకున్న ప్రేమని, బాధ్యతనీ "వైద్యం చేసేటోడు" అనడంలో సాధించాడు. ఇక్కడితో కవిత కాలేదు. నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో మనుషులతో పాటు,గొడ్డలి దుఃఖిందంటాడు.
"నాన్న మరణం చూడలేక/ఆ రోజే సగం విరిగిపోయింది/మొనదేలిన ఇనుపగొడ్డలి/పెళుసులు పెళుసులుగా రాలి/నాన్నకు నివాళినర్పించింది". పూర్తిగా గొడ్డలిని మానవీకరణ చేసి,మానవ సంవేదనల ప్రతిబింబంగా కవి నిలబెట్టాడు. గొడ్డలి పల్లెకు ప్రతీక. బహుశా గొడ్డలి మీద తొలి కవిత ఇదే గావచ్చు.
ఏ కవికైనా వర్తమానసంక్షోభం నుంచి ప్రపంచాన్ని బయటపడేసే అక్షరాన్ని రాయడమే ప్రధాన కర్తవ్యం. ఈ కవి గోపాల్ తన సంపుటిలో వర్తమానానికి పెద్దపీట వేశాడు. దుఃఖపుగంప,అడ్డుగోడలు,మనిషి పల్చనైతున్నప్పుడు, కనికరం లేని సముద్రమా, వెలిమామిడి, నెత్తుటి పాదాలకు, కనికరం లేని సముద్రమా మొదలైన కవితలన్నీ అందుకు సాక్ష్యం. అసిఫా చనిపోయినా, మామిడికాయ దొంగిలించాడనీ నిమ్నకులం వాడిని చంపినా, కులంగోడలు కట్టుకున్న మనుషుల్ని చూసినా,దుఃఖాగ్నిలో బతుకుని బుగ్గి చేసుకోవడం తారసపడినా గోపాల్ కుదుపుకు గురవుతాడు. వేదనాక్షరమై,ఆక్రోశమై, పరిష్కారమై చలించిపోతాడు. మచ్చుకి "మా బంగారానివి కదూ..!" కవితను తడమండి. ప్రేమలో విఫలమైన "అక్కల" దుఃఖపుచారికల్ని అక్షరాలుగా కురిపించాడు. ఇవాళ నండూరి "ఎంకీనాయుడుబావ" వలపుల్లేవు.ప్రేమపేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం, వాళ్లను ఏకాకుల్ని చేయడం, ఆత్మహత్యలకు పాల్పడేలా దైన్యాన్ని కలిపించడం నేటి ప్రేమలవిషాదం. అందుకే విఫల వలపు దిగులుతో చనిపోయిన అమ్మాయిలు తమ కన్నవాళ్ల కన్నీళ్లను గుర్తుంచుకోవాలని ఎరుకజేస్తూ, మగవాడి బుద్ధినిలా ఎండగడతాడు.
"వాడిదేం పోయింది/ఎక్కడికెళ్లినా కాలరెగరేసి/నాల్గుమూరల ఆడపూలను కొనుక్కుంటాడు/ప్రేమలన్నీ రాత్రివరకే"ననీ దేహమోహాలక్రీడలో ఆడవాళ్లు బలికావద్దని కోరుకున్నాడు. ర్యాంకుల పందెంలో ఉరకలేక ఆత్మహత్యలకు పాల్పేడే విద్యార్థుల పక్షాన నిలబడి "కడుపుకోతలెందుకు" అని తల్లిదండ్రుల్ని నిలదీశాడు. బిడ్డల ఇష్టాయిష్టాలను తెలుసుకోమన్నాడు. ఈ కవిత కార్పోరేటు వ్యాపారం చేసే దగాగా బొమ్మకట్టించాడు.
మనం ఇప్పుడు ఆధునికత పరాకాష్టలో వున్నాం. మానవసంబంధాలన్నీ ఆర్థికసంబంధాలైన దుస్థితిలో వున్నాం. రక్తం పంచి,జన్మనిచ్చిన బతుకునిచ్చిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించే, కునాగరికతా దైన్యంలో వున్నాం.
"వత్తిజేసి/బతుకును వెలిగించినందుకు కొడుకు/ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టిపోయిండు"(అమ్మదీపం, పుట..39). అందుకే మనందరికిపుడు మానవసంబంధాల్లోని ఔన్నత్యం తెలియాలి.కళ్లు తెరుచుకోవాలి. మనసులో బంధాలపట్ల గౌరవం,విలువా పెరగాలి. పెరగాలంటే గోపాల్ దండకడియం లో అమ్మ,నాన్న,నాయనమ్మ,తాత,మిత్రుడు వీళ్లమీద రాసిన అపురూపమైన కవితలు చదివితీరాల్సిందే..!
చనిపోయిన నాన్నను "ఎలిజీ" గా రాస్తూ, "కడుపునిండా నువు మేపుకొచ్చిన మేక/ఇంటి ముందు/నీ జ్ఞాపకాలను నెమరేస్తుంటుంది/నీ తలకు కిరీటమై మెరిసిన ఎర్రరుమాలు/కొన్ని చెమటచుక్కలు తాగి/ఒడువని ముచ్చట్లు చెబుతుంది". ఇక్కడ నాన్నతో గడిపిన మేక,రుమాలు ఆయనను తలచుకుంటున్నాయి. అలాంటి మనిషి గొప్పతనాన్ని కొడుకులెలా గుర్తుంచుకోవాలో గదా..! కవి వర్ణన ఇక్కడ సహజరమణీయంగా వుంది. "ఈతసాప" కవితలో "ఏ యూనివర్శిటీలో చదవలేదు/కళావిద్య అంటే అస్సలే ఎరుగదు/అయినా అమ్మ/ఈతసాపను ఎంత నైపుణ్యంగా అల్లుతుందో/గిజిగాడు గూడు అల్లినట్టు". ఈ కవితలో అమ్మనే కాదు వూరోళ్ల పేదతల్లుల చెమటచుక్కలతో రాసిన కావ్యంగా ఈతసాపను చెప్పడంతో, దళిత బహుజనుల జీవనవృత్తుల్లోని కళాత్మకత,సౌందర్యసృష్టిని ఉమ్మడిగా వ్యక్తం చేసాడు. "లేనిచోటు" పాదాల్లో నాయనమ్మకు గొప్పగా చోటిచ్చాడు. గోపాల్ కు మనుషులంటే ఎంతో ఆరాధన. కింది చరణాలే తార్కాణం. "దేహం మొక్క నుండి/ఆత్మపువ్వు ఎపుడు రాలిపోతుందో/వున్న కాసిన్ని క్షణాలైనా/మాటలపావురాలకు/స్నేహం గింజలేసి పలకరింపులనీళ్లుపెట్టి/మళ్లీ బాంధవ్యాలనే కువకువరాగాలను బతికిద్దాం".
పట్టణంలో వుండి పల్లెను తలపోయడం ఒకానొక వైముఖ్యంలోంచీ రాస్తుంటారు. పల్లెలో వుండీ పల్లెకవిత్వం చేయడం ఒకానొక మమేక్యంలోంచి పెల్లుబికుతోంది. తగుళ్లగోపాల్ పల్లె అణువణువనీ తన్మయించీ, ఆ పల్లెలోని అందాల్ని,యథార్థ,వ్యథార్త జీవిత దృశ్యాల్ని చక్కని అలంకారికతా, సరళసుందర శైలితో మనముందుకు తెచ్చాడు. పల్లెను వర్ణిస్తూ..
"ఎర్రమన్నుకు వోయిన అక్క/నింపుకున్న ఎర్రమన్ను తట్టలో/నిమ్మలంగా కూసొని నవ్వే/తంగెడుపువ్వు పల్లె". కవిది తెలంగాణ పల్లె అనీ ఇట్టే తెలిసిపోతుంది. అక్కడున్న చెట్లూ,వాగులూ,చెరువులూ,ఆవులు,దూపగొన్నమేకలు, బతుకమ్మలాడే వాడతల్లులు,బావపొంటి గొర్లను మర్లేసే అవ్వ,కలుపుచేలో శ్రమకావ్యం రాసే కూలితల్లి, అన్నింటినీ గుదిగుచ్చి ఎదకి తగిలిస్తాడు. "పసుపు బెట్టుకున్న కాళ్ల మీద/వెండిమెట్టె మెరిసినట్లుండే తన వూరికి(పల్లెకు) బోనాలపండుగకు రమ్మని పిలుస్తాడు. నిండుగ పూసిన తంగేడు లాంటి స్వచ్ఛమైన ప్రేమలక్కడ వాగులై పారుతుంటవనీ "జొన్నరొట్టె కమ్మదనంలోంచి" కమ్మని పల్లె ముచ్చట్లు బెట్టాడు సంపుటి పొడవునా కవి గోపాల్ .
కవిగా రాణించాలంటే నిజాయితీ ముఖ్యం. ఆత్మకథల్లోనే కాదు ఆత్మకథనాత్మక కవితల్లోనూ దాపరికం లేకుండా రాయాలి. గోపాల్ ది నిర్మలహృదయం. దానికి నిలువెత్తు నిదర్శనం "కన్నీటి దారపుకండె". గోపాల్ చిన్నప్పుడు ఒకపూట గోవుల్ని కాసి,మరోపూట చదవడమే కాదు, చదువు నిమిత్తం నగరానికెళ్లినపుడు కరీపాయింట్ లో పనిచేసిన అనుభూతిని కవితాబద్ధం చేశాడు.
"ఎక్కడున్నా సాయింత్రమయ్యే సరికీ/ఉడుకుడుకు కూరల్ని కడుతూ/ఈ ప్లాస్టిక్ కవర్లచుట్టూ/కన్నీటిదారమయ్యే వాడిని" అని కదలిపోతాడు. అంతలోనే "నల్గురు మనుషులు గుమికూడే దగ్గర/జీతం కుదిరినందుకు/నా పేదరికానికి దండం పెట్టుకునే వాడిని". మొదటి వాక్యాల్లో పేదరికాన్ని నిరసిస్తే, రెండవ స్టాంజాలో పేదరికానికి సంతృప్తి పలికాడు. కారణం పేదరికం వలనే సమూహంలో చేరడమేనన్నాడు. కూరలమ్మే అంగడిని అనుబంధాల పేనవేతకు మలుచుకున్న కవిదృష్టి బాగుంది.
చివరిగా "దండకడియం" పేరెట్టుకున్న ఈ సంపుటి ఒకనాటి జీవితవైభవాల్ని,పల్లె ఆనవాళ్లను, ఒక ప్రాంత సంస్కృతినీ అద్దంపట్టింది. దండకడియం తాత గురించిన పోయం అయినా అది దళిత బహుజనుల జీవితాల్లో ఓ పెద్దరికానికి చిహ్నం. శీర్షికలన్నీ ఔచితీవంతంగా పొసగాయి. అభివ్యక్తులు కొత్తగానూ,చాలా సహజంగానూ కవితల్లో అమరాయి. మానవత్వం చాటడానికీ "ఒకే ఆకాశం కప్పుకున్న వాళ్లం" అన్న కారణం చాలు అనడం,మేస్త్రి దగ్గర గమేళా మోసే కూలీని "చెమటపూలచెట్టు" అనడం,పల్లెను "ఎర్రమన్ను తట్ట" అనడం,బక్కిశ్రీను కులహత్యను "వెలిమామిడి" అనడం,మనిషిని "రెండుకాళ్లచెట్టు" అనడం, అమ్మను దేవగన్నేరు అనడం ఇలా వరసలు కడితే పుస్తకం నిండా నాల్కలమీద నిలిచిపోయే పల్లెపదాల రుచులెన్నో వున్నాయి.
"కవిత్వం అన్నం పెట్టదు నాయినా/నిజమే గానీ నన్ను బతికిస్తుందమ్మా" అనే గోపాల్ దండకడియం చదివితే, మనలో కూడా గుండెనిండా బతుకుని పచ్చగుంచే ఆత్మీయతాసవ్వడులెన్నో వినిపిస్తాయి. "బతుకుని తలచుకుని/తనివి తీరా ఏడ్వడానికి/ఒక వాక్యం కావాలి" అన్నాడు మరోచోట.. ఒక్కటేమిటి ఇందులో ప్రతివాక్యమూ బతుకుని జీర్ణించుకున్నదే. బతుకు దారిని విశాలం చేసేదే..!
దండకడియం పోతలో పాలమూరుమాండలికం సౌరుని కూడా జమిలి చేశాడు. కూలితల్లుల బాస,తెలంగాణ పండుగల్లో చిందేసే పదాలు,ఎరుకల వాని బాస కవితలో అత్యంత సహజంగా పొదిగాడు. మట్టి మనుషుల బాసను మనసుపెట్టి కవితలకెక్కించాడు. వాళ్లను "రంగులద్దిన వాక్యాలు"గా అభివర్ణించాడు. వీటితో పాటు ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్లం,దుఃఖపుగంప,మట్టి ఊయల కవితల్లో తాత్వికతను మేళవించీ, తానొక సీరియస్ కవిగా ప్రకటించుకున్నాడు.
పల్లెమూలాలతో ఆగకుండా,కవిత్వం తొవ్వపొంటి ఆనకానక సామాజిక పరిణామాల్ని, ప్రాపంచిక దృక్పథాల్ని, వుద్యమాల్నీ తన పుటల్లోకి చోటు కల్పించి, ప్రజాకవిగా ఎదగాలనీ,వెలగాలనీ ఆశిస్తూ, గోపాల్ కు మనసారా అభినందనలు.

*మెట్టానాగేశ్వరరావు*
9951085760

Comments