బద్దెన పద్యాలు-విశ్లేషణ

బద్దెన-సుమతీశతక పరిశీలన

తెలుగుపద్యసాహిత్యంలో "శతకం" ఒక ప్రత్యేక పాయ.విషయపరంగా నీతి,భక్తి,తాత్విక,హాస్య,చారిత్రక,సామాజికచైతన్య శతకాలు ఎన్నో ఉన్నాయి.పాల్కురికీ సోమనాధుడు రాసిన "వృషాధిపశతకం"మొదటి శతకం కాగా మొదటి నీతిశతకం బద్దెన రాసిన సుమతీశతకం.నీతికి సంబంధించి భర్త్రహరి సంస్క్రతంలో రాసిన "సుభాషిత త్రిశతి"ని  తెలుగులోకి అనువదించిన ముగ్గురు కవుల్లో ఒకరైన ఏనుగులక్ష్మణకవి నీతి పద్యాలు     ఎంతో ప్రసిద్ది చెందాయి.సుమతీపద్యాల ఆధారంగ బద్దెన జన్మస్థలం,జీవితకాలం మొదలగు వాటి గురించి సరైన ఆధారాలు చెప్పడం కష్టం.కానీ చరిత్రకారుల,సాహిత్యకారుల అభిప్రాయం ప్రకారం బద్దెన 13వ శతాబ్దానికి ,వేములవాడ ప్రాంతానికి చెందిన వాడు.
బద్దెన అసలు పేరు భద్రభూపాలుడు.చాళుక్య వంశపురాజు.కాకతీయ రాణి రుద్రమదేవికి సామంతరాజు.బద్దెన రచించిన మరొక గ్రంధం "నీతిశాస్త్రముక్తావళి".దీనిలో బద్దెన తనను తాను బద్ధి భూపతీ,బద్ధినృపా,బద్ధి నరేంద్రా అనే పేర్లతో పాటు 19 బిరుదుల పేర్లతో పిలుచుకున్నాడు.

"శ్రీ విభుడు,గర్వితారి
క్ష్మావర దళకోపలబ్ద జయలక్ష్మీ సం
భావితుడు,సుమతి శతకము
గావించిన ప్రోడ గావ్య కమలాసనుడన్ "

నీతిశాస్త్రముక్తావళి లోని ఈ పద్యంలో సుమతీశతకం ప్రస్తావన కనబడుతుంది.
వేమన,కృష్ణ,భాస్కర శతకాలతో పాటు 1832వ సంవత్సరంలో సి.పి.బ్రౌన్ చేత పరిష్కరించబడి అచ్చయింది.
సుమతీశతకం 13వ శతాబ్దానికి చెందిన రచన అయినప్పటికీ నేటికాలంలోని అనేక మంది వీటిని పాడుకుంటున్నారంటే దానిలోని సరళమైన భాష ఒక కారణమైతే,నేటి జీవితానికి సరిపోయేటట్లు ఉండేలా చెప్పిన నీతి.
"ధారాళమైన నీతులు
నోరూరగ జవులుపుట్ట నుడివెద సుమతీ!"
అనే పద్యపాదాలను బట్టి సుమతీశతకం నీతి ప్రధానంగ రచన చేస్తున్నాడని కవి చెప్పినట్లుగానే ఈ శతకమంతా నీతి ప్రధానంగా సాగింది.ఈ నీతి కేవలం పిల్లలకే కాకుండా పెద్దలను కూడా దృష్టిలో పెట్టుకొని రాసింది.అప్పటి రాజకీయపరిస్థితులను,ప్రజల జీవనవిధానాన్ని బట్టి సుమతీశతకాన్ని రచించాడు.

బద్దెన పద్యాలలో రాజనీతికి సంబంధించిన విషయాలు ఎక్కువ.బద్దెన సామంతరాజుగా ఉండటం,పాలనలోని మెలకువలు తెలిసిఉండడం మరియు కవిగావడం చేత ఎక్కువ భాగం రాజ్యపాలనకు సంబంధించిన అంశాలు చెప్పి ఉండవచ్చు.ప్రధానంగా రాజులు ప్రజల పట్ల ఎలా మెలగాలి,ప్రజలు రాజు పట్ల ఎలా మెలగాలో వివరించాడు.
1)రాజ్యం సమర్థవంతంగా నడవాలంటే సమర్థుడైన మంత్రి ఉండాలి.
2)అధికారగర్వం పనికిరాదు.
3)ప్రతీసారి తప్పులు వెతికే రాజు దగ్గర కొలువు చేయరాదు.
4)రాజు తన కింది సేవకులను ప్రేమగా పిలవాలి.
5)యుద్దంలో పోరాడేవాడే నిజమైన యోధుడు

ముఖ్యంగా ఇవి సుమతీశతకంలో రాజనీతికి సంబంధించి చెప్పిన విషయాలు.
"అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ!"

జీతం ఇవ్వని దొరను కొలవడం కంటే ఎద్దులతో వ్యవసాయం చేసుకొని బతకడం మేలు అని బద్దెన అభిప్రాయం. ఆత్మగౌరవంతో బ్రతకాలనే నీతి ఈ పద్యాలలో కనిపిస్తుంది.  బద్దెన రాజు అయినప్పటికీ నిష్పక్షపాతంగా "తప్పులు వెతికే రాజును సేవించడం పాముపడగ నీడలో కప్ప బ్రతకడంగా"చెప్పాడు.

సరైన నాయకుడిని ఎన్నుకోవాలనే రాజకీయచైతన్యం బద్దెన పద్యాలలో కనబడుతుంది.
"కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!"
మద్యం,డబ్బులకు లోబడి ఓటు హక్కును అమ్ముకుంటున్న ఇప్పటికాలానికి ఇటువంటి పద్యాల అవసరం ఎంతైనా ఉంది.బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే తన గుణం మార్చుకోదు కాబట్టి అర్హత ఉన్నవారినే కూర్చోబెట్టాలంటాడు బద్దెన.


బద్దెన స్త్రీకి ఎంతో గౌరవాన్నిచ్చాడు.పితృసామ్య వ్యవస్థ ఉన్న కాలంలోనూ ఈ శతకం రాసినప్పటికి స్త్రీపురుషులిద్దరికీ సమాన గౌరవం ఇచ్చాడు.
"సిరికిని ప్రాణంబు మగువ సిద్దము సుమతీ!"అని ప్రతి భర్తకు భార్యనే గొప్ప సంపదగా చెప్పడంలో బద్దెన స్త్రీకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడో చూడొచ్చు.

"కులకాంత తోడ నెప్పుడు
కలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠికంట కన్నీ
రొలికిన సిరి యింట నుండనొల్లదు సుమతీ!

భార్యతో గొడవలు పడుతూ లేని నిందను మోపకూడదు.భార్య కన్నీరు కార్చితే ఆ ఇంట్లో సంపద నిలువదని పైపద్యన్ని బట్టి అర్థమౌతుంది.భార్యపట్ల భర్త ఎలా నడుచుకోవాలో చెప్పడంతో పాటు గృహహింస నిరసన ఈ పద్యంలో కనబడుతుంది.పురుష అహంకారంతో భార్యపై పెత్తనం చెలాయిస్తే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది.ఇటువంటి ఎన్నో కుటుంబ విషయాలు తన పద్యాల ద్వారా తెలియజేశాడు.స్త్రీ ఒక్కొ సందర్భంలో ఒక్కో రకంగా అంటే దాసిగా,రంభలాగ ,మంత్రిగా ,తల్లిలాగ ఉండాలని కోరుకున్నాడు.దీనిని బట్టి కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో విలువైనదిగా భావించాడు. స్త్రీ మీదే పూర్తి కుటుంబం ఆధారపడుతుందని బలంగ నమ్మిండు.

1)నవ్వకుమీ పరసతితో....
2)పరసతుల గోష్ఠినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్

ఇంట్లో కలహాలు రావడానికి ప్రధాన కారణం అక్రమసంబంధాలు.అందుకే భార్యభర్తలిద్దరికి పరాయి వాళ్ళతో చనువుగా ఉండకూడదని చెప్పాడు.అనేక గొడవలతో చెల్లాచెదురయ్యే ఇప్పటి తరం వాళ్ళు  ఈ పద్యాలను తమ జీవితాలకు  అనువర్తించుకోవాలి.

స్త్రీ లమీద,చిన్న పిల్లల మీద అత్యాచారాలు తీవ్రంగా ఖండించాడు బద్దెన."పసిబాలల బొందువాడు పసురము సుమతీ" అంటూ హత్యాచారం చేసేవాళ్ళను మృగంతో సమానంగా చెప్పాడు. ఇప్పటికీ ఎన్ని చట్టాలున్నా  అటువంటి హత్యలు పెరగడం తలదించుకోవలసిన విషయం.వీటన్నింటికి కారణం మనుషుల్లో నైతిక విలువలు లోపించడమే.చిన్నతనం నుండే మనిషిలో నైతికవిలువలను నూరిపోసే గొప్ప పద్యాలు సుమతీశతకంలోనివి. బద్దెన మానవసంబంధాలకు ఎక్కువ విలువనిచ్చాడు. కుటుంబంలో తల్లి దండ్రులు,పిల్లలు ఏ విధమైన గుణాలు కల్గి ఉండాలో చెప్పాడు.

ధనం మానవసంబంధాలన్నింటికి మూలంగ  బద్దెన చెప్పాడు."ధనం మూలం ఇదం జగత్ "కదా!"బతుకుబండిని నడిపేది పచ్చనోటేలే"అనే సినిమాపాట మనకు తెలియంది కాదు.డబ్బును  బట్టే మనిషికి గౌరవం.డబ్బులుంటేనే బంధువుల రాక.చెరువు నిండినపుడు కప్పలు చేరినట్లుగానే సంపద ఉంటేనే బంధువులు వస్తారనే సత్యాన్ని మనుషుల స్వభావాన్ని,డబ్బు విలువను తన పద్యాలలో చెప్పాడు.ఇది కేవలం చుట్టాల విషయంలోనే గాక భార్య విషయంలో ఎలా ఉంటుందో చెప్పాడు.

"గడ నుడుగు మగని జూచిన
నడపీనుగు వచ్చేననుచు నగుదురు సుమతీ!"
సంపాదించని భర్తను చూసి  భార్య" పీనుగు నడుచుకుంటు వస్తుందని నవ్వుతుందని అనడంలో
ఇక్కడ మానవ సంబంధాల కంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే విషయం తేటతెల్లమౌతుంది.ధనాన్ని బట్టే మనిషికి గౌరవమర్యాదలు దక్కుతాయనే సత్యం బద్దెన చెబుతాడు.అందుకే బద్దెన పేదవాడిగా చుట్టాలింటికి వెళ్ళకూడదని (సిరి చెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ!)అని జాగ్రత్తలు చెబుతాడు.

"ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ!"

బద్దెన ధనం గురించి అంతిమంగ చెప్పిన  సత్యం
"మన సంపదనే మనకు అవుతుంది గాని ఇతరులది మనకెప్పటికీ కాదు".శివుడి మిత్రుడు కుబేరుడు ఎంతో ధనవంతుడు.అయినప్పటికీ శివుడు భిక్షమెత్తిండు అని పురాణపాత్రల ద్వారా ఈ విషయాన్ని ప్రభావవంతంగా చెప్పాడు.
ధనం సంపాదించాలని చెప్పినా,ధనం చేతనే మనిషికి విలువనిస్తారని చెప్పినా ఆ ధనం కేవలం న్యాయమార్గం ద్వారా మాత్రమే సంపాదించినదై ఉండాలని చెబుతాడు.
"పరధనముల కాసపడక పరులకు హితుడై"అని ధనం సంపాదించే మార్గం చెబుతాడు.
పరుల ధనానికి ఆశపడకుడదని ,అది ఎన్నటికీ శాశ్వతం కాదనే నీతి గుర్తుంచుకోవాలి.

ఇప్పటి కాలానికి చెల్లుబాటు కాని పద్యాలు కొన్ని  సుమతీ శతకంలో కనబడుతాయి.

"అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!"

అల్లునిలో మంచితనం,గొల్లవానికి సాహిత్య ఙ్ఞానం,నిజము మాట్లాడే స్త్రీలు,పొట్టును దంచి బియ్యం తీయుట,తెల్లని కాకులు లేవని పై పద్యభావం.అలాగే
"నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు గమసాలివాని,నటు వెలయాలిన్"
అనే పద్యంలో
పన్నులు వసులు చేసే వారిని,జూదమాడే వారిని,కంసాలిని,భోగముదానిని నమ్మకూడదని అంటాడు.
ఒక సామాజిక వర్గం పట్ల బద్దెనకు ఎందుకింత చులకన అన్న సందేహం తప్పక కల్గుతుంది.ఇది అప్పటి కాలానికి అనుగుణంగ రాసి ఉండవచ్చుగాని ప్రతీ ఒక్క వర్గం చదువుకుంటున్న ఇప్పటి కాలానికిది వర్తించదు.స్త్రీలను కించపరిచే,కొన్ని వర్గాలను కించపరిచే ఇటువంటి పద్యాలను ఇప్పుడు స్వీకరించవలసిన అవసరం లేదు.ఏ శతకంలోనైనా ఇటువంటి పద్యాలు ఉన్నాయి.వాటిని అప్పటి కాలాలకు మాత్రమే సంబంధించినవిగా చూడాలి.

సుమతీశతకంలో శైలి,భాష ప్రత్యేకంగ నిలుస్తుంది.సుమతీశతకంలోని శైలి గురించి ఆరుద్ర "బద్దెన కందాల రచనాశిల్పం సమకాలికుడైన నన్నెచోడుడు,తిక్కన మొదలైన ప్రాచీనుల వైపుకే మొగ్గుతుంది.అర్వాచీనమైన విరుపులు,నడక తక్కువ.అందుకే సుమతీశతకంలోని శైలికీ,దీనికి తేడా ఉందనిపిస్తుంది." తన సమగ్రాంధ్ర సాహిత్యంలో అభిప్రాయపడ్డారు.సుమతీశతకంలో ఉన్నన్ని జాతీయాలు,పలుకుబడులు
నీతిశాస్త్రముక్తావళిలో కనిపించవు.

బద్దెన పద్యాలు చాలా వరకు తర్వాతి కవులపై ప్రభావం చూపించాయి.ముఖ్యంగా కందం ఛందస్సులో శతకం రాసిన కవుల మీద బద్దెన ప్రభావం ఉంది.అలాగే వేమన మీద,కృష్ణశతకకర్త నరసింహ కవి మీద కూడ సుమతీపద్యాల ప్రేరణ  ఉన్నట్లు కనబడుతుంది.

"నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!"

నాలుగుపాదాలలో మొదటిపదంగా ఒకటేపదం (నవ్వకుమీ)ప్రయోగించడం ఎక్కువగా బద్దెన పద్యాలలో కనిపిస్తుంది.ఈ విధమైన ప్రయోగం నరసింహ కవి రాసిన కృష్ణ శతకంలో కనిపిస్తాయి.
1)దిక్కెవ్వరు ప్రహ్లదుకు...
2)నీవే తల్లివిదండ్రివి...
మొదలగు పద్యాలను చదివినప్పుడు సుమతీశతకకర్త ప్రభావం నరసింహకవి మీద ఉండడం గమనించవచ్చు.
వేమన పద్యాలలో కూడా సుమతీశతకంలో  ఉండే కొన్ని పద్యపాదాలకు సారూప్యంగ  వేమన శతకంలో ఉండడం గమనించవచ్చు

 "తమతమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ!"

వీటికి సారుప్యంగ వేమన శతకంలో
1)"స్థానబలిమి గాని తనబలిమి కాదయా"
2)"నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు" మొదలైన పద్యపాదాలను  చూస్తాం.

కనకపు సింహాసనమున....అనే సుమతీ పద్యం లాగే అల్పబుద్ది వాని కధికారమిచ్చిన....అనే వేమన పద్యం కనబడుతుంది.రెండు పద్యాలు అధికారం గురించి కుక్కను ఉపమానంగా తీసుకొని చెప్పినవే.

"తా ననుభవింప నర్థము
మానవపతి జేరు గొంత మరి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరుజేరునట్లు తిరముగ సుమతీ!"
లోభి స్వభావాన్ని తెలిపిన ఇటువంటి పద్యమె వేమన శతకంలో కూడా కనపడుతుంది.
"ధనము కూడబెట్టి ధర్మంబు చేయక
తానుతినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా
విశ్వదాభిరామ వినుర వేమ"

లోభి స్వభావాన్ని చెప్పడానికి బద్దెన ఉపయోగించిన "తేనెటీగలు సమకూర్చుకున్న తేనె బాటసారుల పాలౌతుంది" అనే పోలిక వేమన శతకంలో చదువుతున్నప్పుడు వేమనపై సుమతీశతక ప్రభావం ఉండొచ్చు అని తెలుస్తుంది.

బద్దెన మీద ఏ కవుల ప్రభావముందో చెప్పడం కష్టం.కాని సంస్క్రతకవుల ప్రభావం ఉన్నట్టు కింది పద్యాన్ని చదివితే అర్థమౌతుంది.

"పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ,మంత్రి యాలోచనలన్
దన భుక్తి యెడల దల్లియు
ననదుగు కులకాంత యుండనగురా సుమతీ!"

ఈ పద్యం "కార్యేషు దాసి,కరణేషు మంత్రి..."అనే శ్లోకానికి భావంగ కనిపిస్తుంది.
నీతిని చెప్పడానికి సంస్క్రతకవులు,పూర్వకవులు చెప్పిన విషయాలను తీసుకొని ఉండవచ్చు.

"కందం రాసినవాడే కవి"అని నానుడి మనకుంది.అటువంటి కందం ఛందస్సులో సామాన్యజనానికి సైతం అర్థమయ్యేలాగ రచించడంలో బద్దెన గొప్పతనం కనిపిస్తుంది.

1)తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
2) భూమీశుల పాలజేరు భువిలో సుమతీ
3)ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ
సుమతీశతకంలోని ఇట్లింటి ఎన్నో  చివరిపాదాలు జాతీయాలుగా,సామెతలుగ స్థిరపడ్డాయి.మచ్చహరిదాసు గారు "తథ్యము సుమతీ!"పేరుతో సుమతీశతకం మీద రాసిన పరిశోధనవ్యాసాలు బద్దెన మీద వచ్చిన వ్యాసాలలో ఎంతో విలువైనవి.

జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు,సంఘర్షణలకు మార్గం చూపెడుతాయి ఈ పద్యాలు."రారా పద్యాలు చదువ రాజకుమారా!"అని జింకపిల్లల్లాగ ఎగురుతూ ఇప్పుడెంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారు?ర్యాంకుల పేరుతో పిల్లల్ని ఒత్తిడికి గురిచేస్తున్న సంస్థలు పిల్లల్లో మానసిక పరిపక్వత కోసం శతకపద్యాలు నేర్పించాలి."తన కోపమె తన శత్రువు"లాంటి పద్యాలు గురువులాగ మంచిచెడ్డల్ని చెబుతాయి."అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్ "లాంటి పద్యపాదాలు అమ్మ మీద,అమ్మ భాష మీద మరింత మమకారాన్ని కలిగిస్తాయి.

"కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగనెరవు,మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!"

"ప్రేమ,అభిమానం   ఉన్నప్పుడు ఎటువంటి తప్పులు కనిపించవు,ఆ ప్రేమ తగ్గినపుడు  అన్ని తప్పులే కనిపిస్తాయి." మానవ సంబంధాలను చాలా లోతుగా పరిశీలించి రాసిన పద్యం.మనుషుల మధ్య సాధారణంగ గొడువలు రావడానికి ప్రధాన కారణాన్ని విప్పిచెప్పిన  పద్యం.ప్రతీఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఇది అనుభవంలోకి వచ్చినపుడు తప్పకా బద్దెనపద్యం గుర్తుకు వస్తుంది.బద్దెన పద్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క పద్యం చాలు.

ఆధారగ్రంధాలు:
1.పెద్దబాలశిక్ష-గాజుల సత్యనారాయణ
2.సమగ్ర ఆంధ్ర సాహిత్యం(మొదటిభాగం)-ఆరుద్ర
3.సుమతీశతకం-బద్దెన 
     
           -   తగుళ్ళ గోపాల్
                 కలకొండ
                9505056316







Comments