కలకొండ మట్టినుంచి

కలకొండ మట్టినుంచి....
                            1
ఒక చేత పుస్తకాలు,మరోచేత కట్టెవట్టుకొని పొద్దున పొద్దూకి పసుల కాసిన ఈ చేతులే అక్షరాన్ని దిద్దినవి.అమ్మనాయినకు భారం కాకుడదని మల్కాజ్ గిరి కర్రీస్ పాయింట్ లో కూరలు కట్టిన ఈ చేతులే కవిత్వం అల్లినవి.అమ్మతో పాటు మెద మోసిన రోజులు,ఎండకాలం సెలవుల్లో కంకర మోయడానికిపోయిన రోజులు,ఆదివారమొస్తే పత్తితీయడానికి పోయిన రోజులు ఇప్పటికి,ఎప్పటికి నాకు ఎంతో అపురూపం.ఇవన్ని కవిత్వమే నాకు.

మా నాయిన దర్వాజ ఎత్తు మనిషి.నాయిన జీవితమంతా గొర్లను కాసిండు.సొంతంగా గొర్లు,మేకలు లేకపోవడంతోటి వేరే వాళ్ళ దగ్గర జీతం కుదిరిండు.కొన్ని దినాలకు సొంతంగా మేకలు సంపాదించినా అక్క పెండ్లికి వాటిని అమ్మిండు. అక్క పెండ్లికి అప్పుకావడంతో పట్నానికి వలసబోయిండు.చాపల కంపెనిల ఏ అర్థరాత్రి వరకో కష్టపడేటోళ్ళు.ఇంట్లో గొడవల వల్ల హంసక్క గ్యాసునూనెవోసుకొని మాకు దూరమైంది.అప్పటినుంచి నాయిన మాములు మనిషి కాలేకపోయిండు.తిరిగి ఊరికి వచ్చి దొరికిన పనల్లజేసి ఇంటిని నడిపిండు.సపారాలు ఎయ్యడం,బునాదులు తీయం,పచ్చికట్టెలు కొట్టి అమ్మడం ఇట్లా ఎన్నో పనులు చేసి మమ్మల్ని చదివించిండు.నాయిన ఎప్పుడు బయటికెళ్ళినా భుజం మీద గొడ్డలి ఉండేది.అదే మాకు నాల్గు మెతుకుల్ని పెట్టింది.అమ్మ వరినాట్లెయ్యడానికి,కలుపుతీయడానికి,వరి కోతలకు పోయేది.ఏ కాలంల ఏ పని దొరికితే అవన్ని చేసి పొయ్యి మట్టిచ్చేది.గోడలు పూయడం,సున్నాలేయడం ఎక్కువ చేసేది.అమ్మ మట్టిగోడల్ని పూయడం చిన్నప్పటి నుంచి చూసినందుకే "ఒంటి మీద సొమ్ములు లేని మా అమ్మ/ నా వాక్యాలకు మట్టిపూత"అని ఇష్టంగా రాసుకున్న.

పట్నంకెళ్ళి ఊరికివచ్చినంక నా చదువుబాధ్యతనంతా రాజవర్థన్ రెడ్డి సార్ చేతిల పెట్టిండ్రు.సార్ వాళ్ళ ఇంట్లనే ఉండి ఆరు,ఏడు తరగతులు చదువుకున్న.ఏడవతరగతిలో ఉన్నప్పుడే గురుకులం (APRS)పరీక్ష రాయించిండు.ఎనిమిదో తరగతికి నాగర్జున సాగర్ హాస్టల్ కి పోయిన.ఏడవ తరగతిలో ఉన్న ఇ.పరమేశ్వర్ సార్ ,సాగర్లో సుజాత మేడం,డి.సి.నరసింహులు సార్ ,టి.టి.సి లో కనకవాణి మేడం వాళ్ళ వలన తెలుగంటే ఇష్టం ఏర్పడింది.నాగార్జున సాగర్ లో ఉన్నప్పుడు చిన్నచిన్న పద్యాలు కూడ రాస్తుంటి. పదవతరగతి అయిపోయినంక మళ్ళీ బుగులు.ఏం చదవాలి?ఎక్కడ చదవాలి?ఎక్కడుండాలి?.రాజు సారే ఇంటర్మిడియేట్ కోసం కల్వకుర్తిలో ఉషోదయకాలేజిలో చేర్పించిండు.సార్ వాళ్ళ చిన్నమ్మ విమలమ్మ,మాణిక్యరెడ్డి బాపుల దగ్గర ఉంచిండు.అక్కడ ఇంట్లో మనిషిలెక్క పెరిగిన.సమాజంల ఎవరితో ఎట్లుండాలో మాణిక్యరెడ్డిబాపును చూసి నేర్చుకున్న.ఎక్కడికెళ్ళిన తనతో నన్ను తీసుకొని పోతుండె.మాటల్లో పోతనపద్యాలు, నరసింహ శతకపద్యాలు ఎన్నో చెబుతుండె.నేను కాలేజి ఫస్టు వచ్చినప్పుడైతే బాపు ఎంత సంబురపడ్డడో.కల్వకుర్తిలో ఉన్న రెండేండ్లునా జీవితంలో ఎంతో విలువైనవి.కాలేజి సార్ వాళ్ళు కూడ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకునేటోళ్ళు.ఇంటర్ అయిపోయినంక రాజవర్థన్ సార్ టి.టి.సి చేయించిండు.2012 డియస్సీలో టీచర్ జాబ్ సంపాదించినానంటే రాజు సార్ అండగా ఉండడం వలనే.ఇప్పటికీ నాకేకష్టమొచ్చినా మా రాజు సార్ ఉండన్న ధైర్యం నన్ను నడిపిస్తది.ఇపుడు మా ఊరిలో సార్ వాళ్ళ సొంతింట్లోనే ఒక లైబ్రరి ఏర్పాటు చేసిండు .ఇక్కడ ఉదయం,సాయంత్రం రెండు రెండు గంటలు యాభై,అరవై మంది పిల్లలకు ఉచితంగ చదువుచెప్పుతున్నాము.అప్పుడప్పుడు అలసిపోయినా ఈ పని చేస్తున్నందుకు చాలా తృప్తిగా ఉంటుంది.నా మొదటి పుస్తకం "తీరొక్కపువ్వు(నానీలు)"ను రాజు సారే అచ్చేసిండు.దీనిని అమ్మనాయినకు అంకితం ఇచ్చిన.అమ్మనాయిన తరువాత నాకు అమ్మనాయిన లెక్క చూసుకున్న రాజవర్థన్ రెడ్డి సార్ కి ఈ దండకడియాన్ని అంకితమివ్వడం ఎంతో ఆనందంగా ఉంది.

నన్ను సాహిత్యానికి మరింత దగ్గర చేసింది రవిచంద్ర సార్ .కల్వకుర్తిలో  చదువుకునేటపుడు సార్ పరిచయం.టి.టి.సి కోచింగ్ లో తెలుగు చెప్పిండు.ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఇప్పటి వచనకవిత్వం వరకు ఎన్నో విషయాలు చెబుతుండె.ఎదున్నా ముఖం మీదనే నిక్కచ్చిగా చెప్పడం వల్ల నాకవితలను ఎప్పటికప్పుడు సరిచేసుకునేటోడిని.తీరొక్కపువ్వు కు సార్ రాసిన ఆత్మీయవాక్యం ఎన్ని సార్లు చదువుకున్ననో. పద్యం ఇచ్చిన అపురూపకానుక మద్దిరాల శ్రీనివాసులు సార్ .పద్యాలు ఎలా రాయాలో నేర్పుతూ తప్పు ఒప్పుల్ని సరిచేస్తూ నాచేత వందకు పైగా పద్యాలు రాయించిండు మద్దిరాల సార్ .

                     2
మొదట నన్ను సాహిత్యంలోకి "నానీలు"చేయిపట్టుకొని నడిపించినయి.2016లో తీరొక్కపువ్వు పేరుతో నేను రాసిన  నానీల ద్వారా ఎంతోమందికి దగ్గర కాగలిగాను.ఆచార్య ఎన్ .గోపి సార్,అరుణమ్మల ప్రేమ,ప్రోత్సాహం మరుపురానిది.నానీలు రాసే క్రమంలోనే గోపిసార్ సాహిత్యం చదివే అవకాశం దొరికింది.రొట్టె,బొంత,తంగేడుపూలు వంటి వాటిని కవిత్వం చేసిన తీరు నాపై గొప్ప ప్రభావాన్ని చూపింది.నానీల తరువాత వచన కవిత్వం రాస్తున్నప్పుడు "కవిసంగమం" పరిచయం అయ్యింది.కవిసంగమం కవిత్వం పట్ల స్పష్టమైన చూపునిచ్చింది.జాతీయ,అంతర్జాతీయ కవిత్వాలను,కవులను పరిచయం చేసింది.లక్ష్మీనరసయ్య,వంశీకృష్ణ,నారాయణ స్వామి వెంకటయోగి,అఫ్సర్ ,సి.వి సురేష్ ,బొల్లొజుబాబా,రాజారాం తూముచర్ల,పరేష్ దోషి,అనిల్ డ్యాని,శ్రీరాం పుప్పాల గార్లకు అన్ని కృతఙ్ఙతలు చెప్పినా తక్కువే.నిత్యం కవిత్వంతో దగ్గరగ ఉండటానికి వీరి వ్యాసాలు ఎంతో ఉపయోగపడ్డాయి.కవిసంగమం వేదిక మీద మూడవతరం కవిగా నాచేత కవిత్వాన్ని చదివించిండు యాకుబ్ సార్ .ప్రసాదమూర్తి,షాజహాన,పుట్టిగిరిధర్ ,లక్ష్మిరాధిక గార్లతో ఆ వేదిక మీద కవిత్వం చదవడం ఒక గొప్ప అనుభూతి.అప్పటినుంచి బాధ్యతగా కవిత్వం రాయడం మొదలు పెట్టిన.తగుళ్ళ అంటూ ప్రేమగా పిలుస్తూయాకుబ్ సార్  నన్ను గుండెలకు హత్తుకున్నడు.ఇంటికి వెళ్ళినప్పుడల్లా కొత్తకొత్త కవిత్వసంపుటాలనిచ్చి చదివించిండు.ఈ పుస్తకం మీ ముందుకు వస్తుందంటే అందులో సార్ శ్రమ ఎంతో ఉంది.సార్ ని మొదటి సారి కలిసినపుడు నా డైరీలో రాసిన వాక్యాలు కవిత్వం మీద మరింత ప్రేమను కల్గించాయి.

"జీవితం కవిత్వంలా మారేముందు
కవిత్వం జీవితంలోనే
ఎక్కడో ఓ మూల జీవిస్తూనే వుంటుంది
ఏదో ఓ క్షణం
అది మన ముందుకు వచ్చి నిలబడుతుంది
దాన్ని గుర్తుపట్టి హత్తుకోవడమే
మనం చేయాల్సిన పని
ఇక ఆపై
కవిత్వమే మనం
మనమే కవిత్వం"(డా॥యాకుబ్ 2.5.2017)

జీవితంలోనే కవిత్వం ఉంటుంది అన్న ఆ వాక్యాలు నేను రాయవలసింది ఏమిటో స్పష్టంగా చెప్పినట్టనిపించింది.

కవిత్వం ఎట్లా రాయాలి? అని మొదటినుంచి నన్ను వెంటాడుతున్న ప్రశ్నకు శిలాలోలితమ్మ మాటల్లో సమాధానం దొరికింది."ముందుగా మన భావాలను కాగితం మీద పెట్టి ఆ తరువాత ఒక్కొక్క భావాన్ని కవిత్వమెట్లా చేయాలో ఆలోచించాలి.కవిత రూపం మీద,భాష మీద శ్రద్ధ పెట్టాలి.కొత్తగా మనం ఏమి చెప్పామో చూసుకోవాలి"అని శిలాలోలితమ్మ చెప్పిన మాటలు కవిత రాసే ప్రతీసారి గుర్తొస్తుంటాయి.ఎం.నారాయణ శర్మ సార్ రాసిన "ఈనాటికవిత"నన్ను ముందుండి నడిపించింది.75మంది కవుల ఒక్కొక్క కవితను తీసుకొని కవితావస్తువును,వాటి నిర్మాణక్రమాన్ని తెలుసుకోగల్గినాను.నాకు బాగ ఇష్టమైన విమర్శకులలో నారాయణశర్మ సార్ ఒకరు.అనేక కవిత్వసదస్సులలో నా ఆసిఫా(అడవిలో పొద్దూకినట్లు)కవితను గురించి సార్ మాట్లాడడం ఎంతో బలానిచ్చింది నాకు.

కవిగా నేను బాగ సంతోషపడ్డ సందర్భాలలో "ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం"కవిత రాయడం.మా ఊరిలో ఒక ముసలమ్మ గురించి రాసుకున్న.దీనిని చదివాక మానసమేడం బట్టలు,దుప్పట్లు ఆ ముసలమ్మ కోసం పంపించింది.యశస్వి సతీష్ అన్న ఆ కవితను వాయిస్  రికార్డింగ్ చేసిండు.ఆ అమ్మకోసం డబ్బులు పంపించిండు.సి.వి సురేష్ సార్ దానిని ఆంగ్లంలోకి అనువదించి ఎంతో మందికి చేరవేసిండు.నీ మీద ఒక కవిత రాసిన అమ్మమ్మ అని తనతో మాట్లాడుతుంటే అమ్మమ్మ కండ్లనిండ నీళ్ళు తీసుకుంది.ఇది ఎప్పటికీ మరిచిపోలేను.

                             3
-బతుకంతా భుజం మీద పచ్చికట్టెలు మోసి,నా కోసం చిన్నతేనె జోపుకొచ్చె పెదనాయిన,చిన్నాయిన

-మా తమ్ముండ్లు పోయిండ్రు,మీరే మా తమ్ముండ్లనుకుంటాం.ఈ తొవ్వలు మర్వకుండ్రని శోకంగట్టి ఏడ్చే మా మేనత్తలు

-దవఖానలో రాఖీకడుతూ ఎంతకష్టమొచ్చే తమ్మీ అని పట్టుకొని ఏడ్చిన యాదక్క

-ఊరుగాని ఊరు పోతున్నవని పెద్ద ఇనుపపెట్టెనిచ్చి నాగార్జునసాగర్ హాస్టల్ పంపిన కౌసల్యమ్మ(రాజు సార్ వాళ్ళ అమ్మ)

-సగం దూరంబోయి,మళ్ళీ తిరిగొచ్చి "మంచిగా చదువుకో గోపి"అని జేబులో పైసలు బెట్టి కళ్ళతో దీవించిన సద్గుణమ్మ

-మిత్రులను విడువలేక విడుస్తూ తండ్లాడిన క్షణాలు

నన్ను తడితడిగా ఉంచే ఎంతో మంది,ఎన్నో ప్రేమలు.వీళ్ళందరు లేకపోతే నేను లేను.ఈ కవిత్వం లేదు. వీళ్ళందరి ప్రేమలే ఇప్పటి మనుషుల మీద,ఇప్పటి మమతల మీద రాసేలాగ చేసినయి.

ఈ "దండకడియం"లో మట్టిగంపమోసిన మా అమ్మవుంది.చిప్పగొడ్డలితో మమ్మల్ని సాదిన నాయినవుండు.చెట్టెక్కిగుట్టెక్కి గొర్లగాసిన తాతవుండు.పండుగకు రమ్మని పిలిచే మా కలకొండ ఉంది.లోకానికి ఎరుక జెప్పె ఎరుకలి లింగక్క ఉంది.వాకిండ్లు ఊడ్చే లచ్చవ్వ ఉంది.డప్పుగొట్టె ఈదయ్యతాత ఉండు.ఒకే ఆకాశాన్ని కప్పుకున్న ఎల్లవ్వవుంది.రైతుల చెమటవాసనుంది.వాళ్ళ పాదాలకంటిన నెత్తురుంది.నా దారిని వెల్గించిన తంగేడుపూలున్నయి.నా బాల్యపు గాయాలున్నయి.ఙ్ఞాపకాలున్నయి. బిడ్డను కోల్పోయిన తల్లి,తల్లిని కోల్పోయిన బిడ్డల దుఃఖపు వలపోత వుంది.కేరళ వరదను చూసో,ఆసిఫా మరణాన్ని చూసో,ఆత్మీయుల మరణాన్ని వినో దుఃఖమాగనపుడు పదాలుగా మారిన కన్నీళ్ళున్నయి.

బతుకును ప్రేమించడం నేర్పిన ఈ కవిత్వాన్ని,గదువ పట్టుకొని నన్ను ఓదార్చిన ఈ దండకడియాన్ని మీ చేతుల్లో పెడుతున్న.

                          ప్రేమతో
                            మీ గోపాల్ 07.5.2019

Comments