జొన్నరొట్టె కమ్మదనం-దండకడియం! : - డా.రాధేయ

నా కవిత్వాన్ని పలువరిస్తూ ఇంత ఆత్మీయంగ అల్లుకుపోయిన మీ హృదయానికి నమస్కరిస్తున్న సార్ .మీ ఆశీస్సులకు ఎంతో మురిసిపోయాను.దండకడియంను ఆత్మీయంగ దగ్గరకు తీసుకున్న డా॥రాధేయ సార్ కు ధన్యవాదాలతో....

జొన్నరొట్టె కమ్మదనం-దండకడియం!
****************************
- డా.రాధేయ

కవిత్వాన్ని శ్వాస గా,ధ్యాస గా మలుచు కోగలిగిన వారే ఆర్ద్రంగా రాయగలరని
నా విశ్వాసం.

వారి కవిత్వంలో జీవితంపట్ల
ఒక ఆత్మవిశ్వాసం తొణికిస లాడుతూ ఉంటుంది.

వారి మాటలో,చేతిలో,అంతెందుకు దైనందిన జీవన యానం లో కూడా కవిత్వమే మమేకమై ఉంటుంది.

నేను కవిత్వాన్నిఎంతగాఅభిమానిస్తానో
,ప్రేమిస్తానో,కవులను కూడా అంతే అభిమానిస్తాను,గౌరవిస్తాను అనే విషయం సాహిత్య లోకానికంతా తెలిసిన విషయమే.

వారి ప్రతిభను గుర్తించి,అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు.కవిత్వానికి నిరంతర పాఠకుణ్ణి.

'కవిత్వంనాకు కన్నుమూత పడని జ్వరం గా
కవిత్వం నా కనురెప్పల మీద వాలిన ఒక నమ్మకమైన కల' గా (అవిశ్రాంతం) భావించాను.

నాకు తెలిసి కొందరు కవిత్వం క్యాజువల్ గా,రాస్తారు మరికొందరు అలవోకగా, ఇంకొందరు సమాజ నిర్దేశకులు గా తమ్ము తాము భావించుకొని రాస్తూ ఉంటారు.

రాయడంలో వేగం ఉండకూడదు.తదేక ధ్యానం లో ఉండాలి. కొందరు రాశిలో చూసుకొని మురిసిపోతూ,గుర్తింపు కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు.

కొందరు మాత్రమే భావన లోనూ,ఊహ లోనూ,బాధ్యతగా, అతిశయం లేని స్వభావోక్తి లోనే రాస్తారు.

అలాంటి యువతరంకవుల్లోనాకునచ్చిన
కవిగా ఇటీవల తగుళ్ల గోపాల్ నాకు దగ్గరయ్యాడు.

యువ కవి గోపాల్ కవిత్వ సృజన లో "దండకడియం" తనదైన ప్రాపంచిక దృక్పథంలో సజీవంగా నిలబడ్డ కావ్యం.

భాషా,భావం,అభివ్యక్తి,లో ఒక మెరుపు వేగంలో దూసుకొచ్చిన కవిత్వం గా దండకడియం నా ముందుకొచ్చింది.

'కొంగును మసిగుడ్డ చేసి
గంజిని వొంపుతూ
పేదరికం లోని ప్రేమల్ని పరిచయం చేస్తుంది..
అంటూ గంజి లోని మెతుకును గురించి రాసినా..

కళ్ళు మూసుకొని నిండా కన్నీళ్ళతో,
నాన్నను తల్చుకుంటూ చెమట చుక్కల్నితడుముకుంటున్న కవి గా,

జీవిత మన్నాక దుఃఖం ఉంటుంది
దుఃఖాన్ని మోస్తూ తిరగడమేజీవితమని
రక్తమూ+కన్నీళ్లు =జీవితంలో భాగమే నని ,దుఃఖపు గంపను మోస్తున్న కవిగా,

చెరువు గట్టు అయినా,ఎర్రమన్ను తట్టయినా ,కూలి తల్లి కట్టెల మోపైనా,
పడుగు పేకల మధ్య మగ్గం బతుకైనా
వడ్డేరోల్ల చేతుల సుత్తైనా ,

బహుజన సమూహ శ్రమవేదాన్ని
కవిత్వమై విన్పించిన వాడు గోపాల్.

జొన్న రొట్టెల కమ్మదనాన్ని కవిత్వంలోనే
కొసరి కొసరి తినిపిస్తాడు.అసిఫా తల్లి
దుఃఖాన్ని పంచుకుంటాడు.

అమ్మీ...
అందంగా కట్టిన నీ గోరీ మీద
అసిఫా కు బదులు
పవిత్ర భారత్ అని రాయించాను
చూసి నవ్విపోదురా తల్లీ...

అంతేకాదు..గుంతగిన్నెలో బెల్లం బువ్వ తిన్నా, ఆల్బమ్ ను ఆత్మీయంగా వెనక్కి తిరగేసినా,అమ్మ బువ్వ చేతి కొంగును ఒక నిరలంకార పద్యం గా విన్పించినా,

ముల్లు పాఠానికి అక్షరాలుతొడిగించినా,
నొసటిపై గాయాన్ని ముద్దాడినా,
ఈతచాప,మళ్లీ బతికినట్టు కలొచ్చినా మనసుకు సూటిగా తగిలేటట్లుగా తగుళ్ళ గోపాలే రాయగలడు

బతుకుపోరులో దుఃఖ నదిని దాటుకుంటూ వచ్చినా,కల్వకుర్తి మన్ను రుణం తీర్చలేనంటాడు. మన్నురుణం తీర్చలేనంటాడు .

గొడ్డలి లోనే నాన్న రూపానికి దండం పెట్టినకవి, పానమంతగా తండ్లాడుతూ
తాత దండ కడియాన్ని ముద్దాడుతూ..

పదిమందిల తిరిగినప్పుడు
గొల్ల పెద్దయ్య మనవడిని అని
చెప్పుకోవడమంటే...
నీ దండని ముద్దాడిన దండ కడియాన్ని
ముద్దు పెట్టుకున్నట్టే ఉంటది.

ఇలా గత మూన్నెళ్లు గా దండకడియం
నాలో అలజడి చేస్తోంది.ఏదో ఒకటి రాయాలి,రాయకుంటే మాత్రం ఈ ఊపిరాడని ఉక్కపోతను భరించలేను

అందుకే స్థాలీ పులాక న్యాయం గా
ఈ కొన్ని మాటలు..

అనుకున్న వస్తువును ఆర్తిగా ఆర్ధ్రంగా
అభివ్యక్తం చేయడంలో ప్రతిభను చాటు కున్నాడు కవి.

భాషను,భావాన్ని సరళీకృతం చెయ్యడం లోనూ తొలి కవితా సంపుటిలోనూ,కవిగాతన ఉనికిని ,
తనదైన శైలినీనిలుపుకున్నాడు

ప్రాంతీయ యాసపై వీరాభిమానం చాటుకోకుండా శిష్టవ్యవహారాన్నే
కవిత్వం లో పలికించి రాష్ట్రేతర తెలుగు భాషాభిమానుల్ని సైతం ఆకర్షించాడు.

ఎందుకంటే స్థానిక మాండలిక పలుకు బళ్లను ఎక్కువగా వాడి ఉంటే ప్రాంతే తరుల పాఠకుల అవగాహన కోసం
మళ్లీ ఫుట్ నోట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ సం.మా అవార్డు పరిశీలనలో ఈ 'దండకడియం' మంచి కావ్యం గా న్యాయనిర్ణేతల ప్రశంసా పాత్రమైంది.

ఇవాళ్టి యువతరం కవుల్లో దండకడియం గోపాల్ గామున్ముందు తనదైన ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలడని నా విశ్వాసం కూడా.

మంచి కవిత్వాన్ని చదివానన్న తృప్తి కలిగించిన గోపాల్..
నిన్ను కౌగిలించుకోవాలనిఉంది ,
కరచాలనం చెయ్యాలని ఉంది,
కరోనా కన్నెర్ర జేస్తోంది.

నువ్వు చిన్నవాడివైపోయావ్
అందుకే మనసారా అభినందిస్తున్నా.

Comments