చిట్టచివరివాన-విశ్లేషణ


అందమైన ఫోటోఫ్రెమ్ "చిట్టచివరి వాన"

తెలుగుసాహిత్యంలో అనుభూతి కవితకు ప్రత్యేక స్థానముంది.అనుభూతికవితలో అనుభూతే ప్రధానంగ వుంటుంది.ఈ అనుభూతి మానసికమైనది.ఙ్ఞానేంద్రియాల ద్వారా గమనించినటువంటి విషయాన్ని మనసు చిత్రిస్తుంది.అనుభూతికి ప్రేరణ ప్రకృతి.ప్రకృతి సౌందర్యాన్ని అనుభూతి కవితగా మల్చుతున్న తెలంగాణ కవుల్లో సత్యశ్రీనివాస్ గారొకరైతే ఇప్పటితరం కవుల్లో విజయ్ కుమార్ ఎస్వీకే మరొకరు.

వానపడుతున్నప్పుడు గోరటివెంకన్న లాంటి పల్లెకారుడు "సెట్ల కురులమీద బొట్లుబొట్లు రాలి/గట్ల బండల మీద గంధమయి పారింది"అనుకుంటూ చెట్టు,పిట్టలను చూసి పరవశించిపోతూ పాడుకుంటాడు.
మరి హైదరాబాద్ లాంటి నగరంలో నివసించే ఒక కవి హృదయం ఎట్లా పారుతుంది?ఎంతలా పరవశించిపోతాడు?ఎన్నెన్ని ఙ్ఞాపకాలను ముందలేసుకుంటాడు?వీటన్నింటికి సమాధానం విజయ్ కుమార్ ఎస్వీకే కవిత్వం "చిట్టచివరివాన"చదివితే అనుభవంలోకి వస్తుంది.

"అమ్మెప్పుడు/చాలా ఙ్ఞాపకాల తడి"(వానమ్మ-87)అంటాడీకవి.ఇక్కడ అమ్మంటే వానమ్మ.ఎన్ని ఙ్ఞాపకాలో వానచుట్టు!పారే కాలువల్లో కాగితపుపడవలు వొదిలిన ఙ్ఞాపకం,చిన్నహోటల్లో వేడివేడి చాయ్ తాగిన ఙ్ఞాపకం.మిత్రులతో కలిసి వానలో గంతులేసిన ఙ్ఞాపకం.మోరిపండ్ల గంపతో గల్లీలోకొచ్చిన లంబాడితల్లి ఙ్ఞాపకం.వానలో తడుస్తూ బాల్యఙ్ఞాపకాలనెన్నింటినో నెమరువేసుకుంటాడు విజయ్ .
"చిట్టచివరి వాన"లోని సగంపైగా కవితలు వాన గురించి రాసినవే. కొన్ని వానచినుకుల ముద్ద,బండగుర్తు వాన,వానాగిపోయాక దారి,అడుగుల ముగ్గు,వానాకాలపు గొడుపు పాప,వానమ్మ,వానాగిపోయింది...యిలా ఎన్నో కవితలు మనల్ని వానలోకి నడిపించుకొని పోయి,వానలో తడిచిన అనుభూతినిస్తాయి.

విజయ్ కుమార్  కవిత్వంలో వానలో తడిసి నిల్చున్న చెట్టు కురులు దులుపుకున్నట్లు కనబడుతుంది.గూటిలోంచి తొంగిచూసే పిట్టొకటి మాట్లాడుతూ కనబడుతుంది.వానలో తొక్కుడుబిల్ల ఆడే పసిపాపలు కనబడుతారు.గదిలో వొంటరిగా కూర్చున్న భావుకుడు కనిపిస్తాడు.పిట్ట,చెట్టు,ఆకాశం,వాన,కిటికి,చీకటి ...సమస్త ప్రకృతి కనబడుతుంది తన కవిత్వంలో.పర్యావరణస్పృహతో ప్రకృతిని అధికంగ ప్రేమిస్తూ రాసిన విజయ్ కవిత్వంలో అనుభూతి ప్రధానం.ప్రకృతితో పాటు కుటుంబఅనుబంధం విజయ్ కవిత్వంలో ఉంటుంది.

"చిట్టచివరివాన"లోని వస్తువు వాననే అయినా వానతో ముడిపడ్డ దృశ్యాలు వేరు.తాను చెప్పెది హైదరాబాద్ నగరంలోని వాన గురించి.
1)"తడిచే గొడుగుల్ని
మనసు తడుపుకోని మనుషుల్ని
గుంటలో నిండిన నీటిలో దూకే పిల్లల్ని
వానొస్తుంది యెటు పోతున్నవ్ అనడిగే అమ్మని
చూసే వరకు
యీ రాత్రి వాన/నన్ను కలవరిస్తూ
కురుస్తూ వుంటే బాగుండు"(కురువాల్సిన-86)
2)తడి భాష మొదలవుతుంది
గొడుగులాగా /యెవరో
యీ కొమ్మనుండి ఆ కొమ్మకు
కట్టిన కవరు కింద /నిలబడి (తడిమాటలు-పే.156)
వానలో ఆడుకునే పిల్లలను,చెట్టుకింద కట్టిన నల్లని కవరు కింద నిలబడే వాళ్ళను  ,ఇంకా
యిలా నగరంలో కనబడే ఎన్నో దృశ్యాలను మన ముందుంచుతాడు.హైదరాబాద్ ను కేవలం ఒక యాంత్రికమైనదిగా చూసిన మనకు కొత్తచూపు నిస్తాయి యిట్లాంటి దృశ్యాలు.
 తాను పొందిన అనుభూతిని,తాను చూసిన దృశ్యాన్ని ఒక భావచిత్రంగ మలుస్తాడు.
పాఠకుల కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపివుంచగలిగేది "భావచిత్రం".ఎజ్రా పౌండ్ దీనినే "ఒక క్షణంలో ఒక మేధో మరియు భావోద్వేగ సముదాయం"గా చెప్పాడు.విజయ్ కవిత్వంలోని భావచిత్రాలు ఎంతందంగా గీస్తాడో   చెప్పడానికి "పూలబుట్ట"కవితొక్కటి చాలు.
"అమ్మ చీర మీది/పూవుల్ని /కోస్తున్న పసిమొగ్గ
రావు/యెంతకీ
పాప బుంగమూతి పెట్టిన /బంతిపూవు అయ్యింది.
కళ్లన్నీ పూలు చేసుకున్న పాప/తల్లి కొంగును/
చెట్టులా కప్పుకుంటుంది
పాప యిప్పుడు /పూల బుట్ట"(పూల బుట్ట-68)

ఈ కవితను చదివినప్పుడు పూలచీర కట్టుకున్న అమ్మ కుచ్చిళ్ళ దగ్గర పూలు తెంపుతూ ఆడుకునే పాప దృశ్యం కనబడి పిల్లల అల్లరిని,అమాయకత్వాన్ని గుర్తుచేస్తుంది. పసిమొగ్గ,బుంగమూతి పెట్టిన బంతిపూవు,కళ్లన్నీ పూలు చేసుకున్న పాప ఇలాంటి పదచిత్రాల వలన విజయ్ కవిత్వం గొప్ప అనుభూతినిస్తాయి. కొన్ని పదాలతో చిత్రంలా గీసే భావచిత్రాలు (ఇమేజరీలు) విజయ్ కవిత్వం నిండా వుంటాయి.అబ్బురపరిచే ఇమేజరి తన కవిత్వముద్ర.
విజయ్ ప్రతి కవితా ఒక్కొ "ఫోటోఫ్రెమ్ ".గతాన్ని తవ్వుతుంది.ఙ్ఞాపకాలను మోసుకొస్తుంది.ప్రకృతీ సౌందర్యాన్ని కనులముందు నిలుపుతుంది.
ఏదైనా విషయాన్ని ఇమేజరీగా మలిచే క్రమంలో  స్థానభ్రంశీకరణ,మెటానమీ,సినక్డకి నిర్మాణవ్యూహాలు కనబడుతాయి.

"తడికాళ్ళు
 వానని యింట్లో
గుమ్మరిస్తాయి
చినుకుల యిల్లంతా
సందడిపిల్ల"(వాకిలి-63)
ఇక్కడ 'తడికాళ్ళు' వానలో తడిసిన పిల్లల్ని,మనిషిని గుర్తుకు తేవడం సినక్డకి.ఒక వస్తువుకు బదులు దానికి సంబంధం ఉన్న వస్తువులోని భాగంతో సూచిస్తూ  అందమైన ఇమెజరీ గీశాడు.

"దూరాలను /వొక్క ముడికి కట్టేసే
తాడుమనసును/పేనుతున్న కలయిక"
                     (మరొక-పే.101)
దూరాలను కలిపే మనసును,తాడు పేనె దృశ్యంతో సమన్వయం చేస్తూ "తాడుమనసు"రూపకం ద్వారా ఒక చిత్రాన్ని గీశాడు కవి.ఈ కవి యీ భావచిత్రాలు గీయడం వెనుక ఎన్నో సందర్భాలు.
గదిలో తాను పొందిన ఒంటరితనం కావొచ్చు,
కుండబోతగా కురిసిన వాన కావొచ్చు,హైద్రాబాద్ లోని జాజురంగు గోడల మీద గీసిన చిత్రాలు ప్రేరణ కావొచ్చు.ఏదైతేనేం,దేనినైనా తనలోకి ఒంపుకొని దృశ్యం గీయడం అతని సొంతం.

విజయ్ కుమార్ కవితానిర్మాణం చాలా వరకు పొట్టివాక్యాలతో ఉంటుంది.కొన్ని సార్లు ఒక్క పదమే ఒక వాక్యంగ ఉంటుంది.ఒక విషయాన్ని నిర్వచిస్తున్నట్టుగా కూడా ఉంటుంది.
1)అవతలి వొడ్డుకి/విన్నపం లేఖ/సరంగు అరుపు
2)తులసి నవ్వినట్టే/పచ్చగా/నవ్వు పూస్తుంది"
3)చెట్టు దాహం తీర్చే/మా అమ్మ /తల్లిచెట్టు"
           (వానచెట్టు-98)
మూడు పాదాలు ఉండి దృశ్యానుభూతిని కలిగించే హైకూ నిర్మాణం విజయ్ కవితల్లో అధికం.అమ్మ చెట్టుకు నీళ్ళు పోయడాన్ని "చెట్టు దాహం తీర్చుతుంది" అనడంలో గాఢతవుంది.ఒక ధ్యానాత్మక స్థితిలోంచి గాఢతతో,సంక్షిప్తంగ వ్యక్తీకరించడం విజయ్ కవితల్లో కనబడుతుంది. కొన్ని సార్లు పాఠకుడు అర్థంచేసుకోవడానికి సంక్లిష్టంగ కూడా ఉంటుంది.చిన్నచిన్న పదాలతో చెప్పడం వలన  కవిని అందుకోవడంలో పాఠకుడు కష్టపడవలసి వుంటుంది.మొత్తానికి  జీవితం,అనుభవం,అనుభూతి ఈ మూడూ విజయ్ కవిత్వానికి బలం.అమ్మ మీద రాసిన మిగతా కవులకు,విజయ్ కి ప్రధానమైన తేడా ఇదే.

నగరంలో తన బాల్యానికి గుర్తుగా వున్న జామచెట్టును పెకిలించినపుడు
"నాకూ చెట్టుకూ /మధ్య
నేలంత/విశాల ప్రేమ నాటుకుపోయింది" అంటాడు.
నగరం మీద,అక్కడి పరిసరాల మీద చెప్పలనంత ప్రేమ అని చెప్పడానికి "నేలంత"ప్రేమ ఉందనడంలోనే తన ప్రేమ మనకు అర్థమౌతుంది.నగరాన్ని "విరహం వెదజల్లు గజల్ "అని అంటాడు ఈ కవి. నగరం చుట్టు,ప్రకృతి చుట్టు గిరికీలు కొడుతున్న పక్షి విజయ్ కుమార్ ఎస్వీకే.చివరి కవితలో "వానాగిపోయింది"అంటాడు గానీ నిజానికి అప్పుడే లోలోన వాన పడడం మొదలవుతుంది.

-తగుళ్ళ గోపాల్ ,కలకొండ
9505056316

పుస్తకం వివరాలు
పేరు:చిట్టచివరి వాన
కవి:విజయ్ కుమార్ ఎస్వీకే
వెల:150
కవి ఫోన్ నంబర్ :9703335955
ప్రతులకు:నవతెలంగాణ పుస్తకకేంద్రాలలో

Comments