ఒంటరియుద్ధభూమి -ఒక విశ్లేషణ


బతుకుయుద్ధమే పసునూరి కవిత్వం

"పసికడుపుకు
పాలుమాత్రమే తాపలేదు
పాటను కూడా తాపింది
లోకాన్ని గెలువడానికి
అక్షరాల తొవ్వ జూపింది"
      (ఒంటరియుద్ధభూమి-పు.49)
ఈ మాటలంటున్నది ఒక తెలంగాణ కవి.ఈ నేలమీద బతకడం కూడా ఒక యుద్దమే.ఆకలి మీద యుద్ధం.ఆత్మగౌరవం కోసం యుద్ధం.అటువంటప్పుడు ఏ తల్లి అయినా పాలు మాత్రమే ఎలా తాపుతుంది?పాలతో పాటు కన్నీటిబతుకుపాటను కూడా తాపి పెంచుతుంది.అటువంటి తల్లుల్లో వరవ్వ ఒకరు.ఆమె కన్న పాట పేరు పసునూరి రవీందర్ .

సమకాలిన సామాజిక సమస్యల మీద పాటలల్లే,కవిత్వం రాసే కవులు రెండు రకాలుగా ఉంటారు.ఉద్యమాలకు మద్దతుగా రాసే కవులు ఒకరైతే ఉద్యమంలో పాల్గొంటు,ప్రజలతో మమేకమై ప్రజాసమస్యలమీద గొంతు విప్పే కవులు మరొకరు.పసునూరి రెండో కోవకు చెందిన కవి.తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలుకొని ఇప్పటిదాక జరిగిన ఉద్యమాలలో పసునూరి పాట ఉంది.మాట ఉంది.తెలంగాణ ఉద్యమంలో "లడాయి"దీర్ఘకవితతో ముందున్నడు."తెలంగాణకడ్డెవడు"అని నినాదమై నడిచిండు.మారుతున్న పల్లెను,ఆధునికయుగం చెప్పబడుతున్న నేటికాలంలో కులం ఇంకా ఏఏ రూపాలను మార్చుకుందో  "అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా" కథలుగా చెప్పిండు."తెలంగాణ ఉద్యమపాట"మీద పరిశోధన చేసిండు.

ఉద్యమాలను వేరుచేసి పసునూరి జీవితాన్ని,కవిత్వాన్ని చూడలేం.అందుకే ఈ కవి కవితల్లో ఎక్కువభాగం ఉద్యమసంబంధ కవితలే.ఆవేదన,ఆక్రోశం కలగలసిన స్వరం తనది.తన గొంతులో ఉండే గంభీరత తన కవితల్లోనూ ఉంటుంది."ఒక్కడుగు కూడా బతుకు ముందుకు సాగకున్నా మొండిధైర్యంతో నా పూర్వికులు చేసిన,చేస్తున్న  యుద్ధం కవిత్వం" అంటడు ఈ కవి.ఇది దళితమూలాల్లోంచి కవిత్వానికి తాను చెప్పిన నిర్వచనం.

"ఒంటరియుద్ధభూమి"లోని చాలా కవితలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవే అయినా ఇప్పటికీ వాటి ప్రాసంగికతను కోల్పోకుండా ఉండడం పసునూరి కవితల ప్రత్యేకత.
  "ఈ భూమి సల్లగుండ
   కాసిన్ని చినుకులో
  కాసింత నెత్తురో
    తాకితే చాలు
    వృక్షాలకో,వీరులకో జన్మనిస్తుంది"
             (నెత్తురింక ఆరలేదు-పు.139)
ఇది ఉద్యమాలకు సంబంధించిన కవితే అయినా పోరాటాల నేలగా పేరుపొందిన తెలంగాణ ఔన్నత్యాన్ని చెప్పింది.కన్ననేల మీద తనకున్న మమకారంతో పాటు తెలంగాణ నేల స్వభావాన్ని,ఇక్కడి త్యాగాలను గుర్తుకు తెస్తాయి ఈ వాక్యాలు.పసునూరి కవిత మలిదశ తెలంగాణ ఉద్యమాలను రికార్డు చేసింది.
"ముల్లకంచెలు మొలుచుకొచ్చి
ఖాకీల కర్కషత్వంతో నెత్తురోడుతుంటే
అది నీ తనువే అయివుంటది"
ఉద్యమానికి ప్రధాన కేంద్రంగ ఉన్నా ఉస్మానియా క్యాంపస్ గురించి,అక్కడి ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థుల గురించి చెబుతూ నెత్తుటిమడుగైన ఉస్మానియా క్యాంపస్ ను కళ్ళముందుంచుతాడు.పసునూరి రవీందర్ కవిత్వంలో తెలంగాణ ఉద్యమసంబంధ కవితలు ఒక భాగమైతే మిగతాకవితలన్ని దళితబహుజన దృక్పధంతో రాసినవే.

బుద్ధిజం,అంబేద్కరిజం తాత్వికభూమికగా పసునూరి కవిత్వం కనబడుతుంది.మనిషిని ప్రేమించే తత్వాన్ని బుద్దిజం నేర్పితే కులమతాలతో నిర్మితమైన ఈ సమాజంలో ఎట్లా బతకాలో అంబేద్కరిజం నేర్పించింది.

"తరాల నష్టం యాదికొచ్చి
పసిపిల్లలతో అన్నడు కష్టంగా
 ఎన్కపడ్డోళ్ళురా మీరు...సదువుకుంటే బాగుపడ్తరు"
      -(తుపాకి పశ్చాత్తాపం-పు.121)
చదువు మాత్రమే వెలివాడల బతుకుల్లో వెలుగును నింపుతుందని బలంగా నమ్మినవాడు ఈ కవి.అంబేద్కర్ జీవితం కూడా మనకు ఇదే నేర్పిస్తుంది.
1)నీ చూపుడు వేలే కదా
మాకు అక్షరాల దారులు పరిచింది
      (ఙ్ఞానఖడ్గశిఖరం-పు.68)
2)నిచ్చెనమెట్లను కూల్చేందుకు
నీ చూపుడు వేలే కావాలి.
        (ఙ్ఞానఖడ్గశిఖరం-పు70)
మొదటివాక్యంలో అంబేద్కర్ చూపుడువేలు ఙ్ఞానానికి ప్రతీక.రెండోవాక్యంలో అన్యాయాన్ని ఎదురించడానికి గుర్తు.వీటిని బట్టి తన లక్ష్యమేమిటో స్పష్టమౌతుంది.అంటరానితనం ,కులవ్యవస్థలు పోయి సమసమాజం కోరుకుంటున్నాడు.అంబేద్కర్ ఆశయాలు,ఆలోచనలను ముందుకు తీసుకెళుతుంది పసునూరి కవిత.

"డక్కలోల్లకు బుక్క దక్కాలి
బైండ్లజమిడికలకు గౌరవం పెరగాలి
చిందుల ఆకలిరాగం రంది తీరాలి
సమస్త వెలికులాలు తలెత్తుకు బతకాలి"
 (డప్పు ఇంకా మండుతూనే ఉంది-పు.92)

"సమస్తవెలికులాలు తలెత్తుకు బతకాలి"అన్న వాక్యం పసునూరి కవిత్వం ఎందుకొరకు,ఎవరికొరకు రాస్తున్నాడో చెబుతుంది.తాను కోరుకునేది వెలివాడల్లో వెలుగు.కింది కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకడం.
జాషువా,కొప్పుల నాగరాజు,వేముల ఎల్లయ్య ,గౌరీలంకేష్  మొదలగు వారిపై తాను రాసిన కవితలలో దళితబహుజన దృక్పధముతో పాటు ఇప్పటి వర్తమానసమాజాన్ని చూపెడుతాయి.
గతం చేసిన గాయాల గురించి,అవమానాల గురించి,ఇప్పుడు దళితులపై జరుగుతున్న దాడుల గురించి,పరువుపేరుతో చేస్తున్న హత్యల గురించి నిర్భయంగ మాట్లాడుతాడు.

పసునూరి  తన కవిత్వానికి ఒంటరియుద్ధభూమి అని పేరు ఎందుకు పెట్టిండు?జీవనపోరాటం చేసి అలసిపోయిన అమ్మ ఒంటరియుద్ధభూమిలాగుందడు కవి.

"చెమటోడ్చే కాడ
అయ్యతో పోటీపడి
గెలిచిన కూలిపోరు విజేత
జోడెద్దు మధ్యలోనే డ్రాపవుటైతే
సంసారబండిని ఈడ్చి ఊడ్చి
కూలబడని బక్కెద్దు అవ్వ"

ఒక దళితబహుజన స్త్రీ ఎన్నో బాధలను భరించి,భర్తపోయినా ధైర్యంతోటి పిల్లల్ని సాదుతూ మొగోని లెక్క సంసారాన్ని నడిపిస్తుంది. ఇటువంటి తల్లుల బతుకే ఒక యుద్ధం.పసునూరి కవిత్వం లోతుల్లోకి పోతే "నోటికడ్డం కొంగు పెట్టుకోకుండా వీధులకు పరిమళాలద్దే "కొంత మంది తల్లులు కనిపిస్తరు.
నగరాలను ఊడ్చే ఈ స్త్రీల జీవితాలలో ఎన్ని సమస్యలుంటాయి?ఎన్ని కష్టాలుంటయి?ఒక్కపూట కూడా తిండిలేని వాళ్ళు ఎంతమందో?ఇల్లు లేక మురికికాలువలప్రక్కన బతుకుతున్నవాళ్ళు ఎంతమందో?వాటన్నింటిని తట్టుకొని బతుకుతున్న బతుకే ఒక యుద్ధభూమి.తెలంగాణ ఉద్యమంలో బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు రోజూ బిడ్డల్ని యాదిచేసుకొని బతుకుతున్న బతుకు ఒక యుద్ధభూమిలాంటిదే.సమస్తదళితబహుజనుల బతుకే ఒక యుద్ధం .

రవీందర్ కవిత్వాన్ని ఎక్కువమంది పాఠకులు సొంతం చేసుకోవడానికి కారణం ఇప్పటి యువతరం సంభాషణల్లో ఉండే అనేక సాంకేతిక పదజాలం తన కవిత్వంలో ఉండడమే.
"నీ పెదాలమీద డాలర్ నవ్వుల్ని పూయించలేను
అమెరికా కలల్ని అందంగా నీకందివ్వలేను
జీవితాన్ని మార్చే ఒకే ఒక్క ఐడియాను నీకు కొనివ్వలేను
నెట్ వర్క్ కుక్కపిల్లలా నీ వెంట తిరగలేను"
    (డాలర్ ప్రేమల నడుమ-పు.49)
 ఇప్పటి ప్రేమలు డబ్బుతో ఎలా ముడిపడి ఉన్నావో తానే ఒక ప్రేమికుడిగా వ్యంగ్యంగ చెబుతున్న వాక్యాలివి.'ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది'లాంటి టి.వీ ప్రకటనలు,నెట్ వర్క్ ,డాలర్ లాంటి పదాలే గాక వ్యారంటి,వైరస్ ,వైఫై మొదలైన ఎన్నో పదాలను ప్రతిభావంతంగా ,ఆధునిక ట్రెండ్ కు అనుగుణంగా తన కవిత్వంలో వాడాడు.తాను చెప్పదల్చుకున్న విషయాన్ని తనకు నచ్చినట్లు గాక ఇప్పటి తరానికి త్వరగా అర్థమయ్యేటట్లు సాంకేతికపదాలను ఉపయోగించడం ఈ కవితల ప్రత్యేకత.

ఇప్పటితరానికి సంబంధించిన భాషను అందిపుచ్చుకున్నా తన మూలభాషను మరువలేదు.గ్రామీణుల ఆటల్లో భాగమైన సంపుడుపంజెం,గవ్వలు,కాముడాట లాంటి పదాలు,దళితజీవితంలోని సందుగ,లంద,తంగేడుచెక్క,దండెం,శర్నకోల,గూటం,రంపెం లాంటి పదాలుజీవన మూలాలను తెలియజేస్తాయి.

పసునూరి కవిత్వంలో ఉండే "దళిత ఈస్తటిక్స్ " తన కవిత్వాన్ని సజీవం చేశాయి.
1)ఆదిజాంబవుణ్ణి నేనే
తండేడుచెక్క నా పరికరం
2)తోలు తెగకుండా గొడ్డును కోసెటోళ్లం
కట్టలు తెగనియ్యకుండ్రి
3)డప్పు శిలుక్కొయ్యకుంటే
యుద్ధం ముగిసినట్టు కాదు
చిర్రలు సానపెట్టబడి
దరువులు నిప్పుకణికల కలగంటయి.

దళిత శ్రమజీవితాన్ని చెబుతూనే ఆ జీవనమూలాల్లోంచే ఇప్పటి కులవ్యవస్థ మీద,అంటరానితనం మీద యుద్ధం చేస్తడు.
మిమ్మల్ని ఎదిరించడం మాకు లెక్కగాదనే ఒక తెగువ,ఆత్మగౌరవ స్వరం ఈ కవితల్లో కనిపిస్తుంది.

పసునూరి రవీందర్ కవిత్వం కులవ్యవస్థతోలును కోస్తున్న సూరుకత్తి.అగ్రవర్ణ అహంకారపు వీపు మీద చెర్నకోల.దళితతల్లులు పాడుకునే కామునిపాట.శ్రమదోపిడికి గురౌతున్న వాళ్ళల్లో చైతన్యం నింపడం కొరకు మోగించిన డప్పుల దరువు. జాషువా ను "తలవంచని పద్యం"గా  చెప్పాడు.జాషువా వారసత్వాన్ని అందుకున్న పసునూరి కూడా ఎవరికీ "తలవంచనిపద్యమే.

     సమీక్ష:తగుళ్ళ గోపాల్
పుస్తకం వివరాలు
వెల:125
పేజీలు:177
ప్రతులకు:
పుట్ట పుస్తకశిబిరం
ఆలగడప,మిర్యాలగూడ,నల్లగొండ జిల్లా
తెలంగాణ -508207
ఫోన్ నంబర్ -7702648825

Comments