ఆంజనేయులు సార్ కవిత్వం

తన అక్షరాల ద్వారా నిరాడంబరంగ జీవించాలని చెప్పి అంతే నిరాడంబరంగ సహజవాక్యమై సాగుతున్న కవి డా॥సి.హెచ్ .ఆంజనేయులు .
సి.హెచ్ ఆంజనేయులు సార్ కవిత్వం మీద రాసిన వ్యాసాన్ని నేటినిజంలో ప్రచురించిన బైసాదేవదాస్ సార్ కు ధన్యవాదాలు.
----------------------------------------------------------

తాత్వికపరిమళం డా॥ఆంజనేయులు కవిత్వం

"పొరలు కప్పబడి ఉంటాయి
ఊదుకోవడమే కవిత్వం-
ఆకుపై నిశ్శబ్దంగా జారే బిందువు
ఒక వెలుగు/ఒక పరుగు
అనుభవాలు అక్షరాలుగా
పదునుదేరటమే కవిత్వం" (డా॥ఎన్ .గోపి)

ఏ కవిత పురుడు పోసుకోవడానికైనా అనుభవం ముఖ్యం.జీవతానుభవం వలన  చూపు మరింత విశాలమౌతుంది.
సమాజంనుంచి నేర్చుకున్న పాఠాల్లోంచి,జీవితం నేర్పిన అనుభవాలలోంచి తాత్వికపరిమళాన్ని వెదజల్లుతున్న కవి డా॥సి.హెచ్ ఆంజనేయులు.తన యాభైఏడేండ్ల జీవితఅనుభవాల తాత్వికసారమే ఈ "ఆశలగాలి పటాలు"కవిత్వం.ఏ కవి వ్యక్తిత్వమైనా తన కవిత్వంలో ప్రతిబింబిస్తుందంటారు.అలాగే ఈ కవిలోని హృదయనిర్మలత,మార్దవం తన వాక్యాల్లోనూ కనబడుతుంది.సామాజిక విషయాలను చెప్పేటప్పుడు ఆవేశం కన్నా ఆలోచనాత్మకంగా ఉంటుంది తన వాక్యం. సాంప్రదాయ కవిత్వఛాయలు తన కవితల్లో  ఎక్కువగా కనబడుతాయి.

"మనిషే నా విశ్వాససంతకం
మనిషే నా సకలం
మనిషితనం నిండా
వెన్నెల ఆరబోసినట్లున్న కాలం కోసం
నిరంతరం తపస్సు"(అపరిచితులం-పే.54)

ఆంజనేయులు కవిత్వంలో మనిషే కేంద్రం.మనిషిని ఆనుకొని వున్న సుఖదుఃఖాలు
,మానవ స్వభావం,యాంత్రికమైపోతున్న ఆధునిక జీవితం తన కవిత్వంలోని ప్రధానవస్తువు.జీవితాన్ని ఎలా దర్శించాడు?ఎట్లా వ్యాఖ్యానిస్తున్నాడు?జీవితం పట్ల తనకున్న తాత్విక దృష్టి ఎలాంటిదో "బతుకు"కవితను చదివినపుడు తెలుస్తుంది.

"బతుకొక నటనల వలయం
బతుకొక భ్రాంతివాస్తవాల చిత్రశాల
బతుకొక జనన మరణాల మధ్య
ప్రాణాయామం" (బతుకు-పే.124)
"ఊపిరివున్నంత వరకే మనిషి,తర్వాత శవం"ఈ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న కవిగా జీవితాన్ని వ్యాఖ్యానిస్తాడు.బ్రతుకే ఒక నాటకరంగమైనపుడు మన పాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.కాబట్టి మనిషి తనలోని స్వార్థాన్ని,అహన్ని విడిచిపెట్టాలంటాడు.జీవితసంద్రంలో ఆటుపోట్లు సహజం.రెండింటిని సమానదృష్టితో చూస్తూ సాగిపోవడమే బ్రతుకని తెల్పడమే తన కవితలలోని తాత్వాకత.అన్నమయ్య,వేమన,వీరబ్రహ్మం మొదలైన కవులు జీవితాన్ని దర్శించిన మార్గమే తన కవితల్లో కనబడుతుంది.

ఆత్మీయప్రపంచాన్ని సంపాదించుకోవడం కన్నా జీవితంలో మరేది ఎక్కువ కాదనే సత్యం వినిపిస్తాడు.
1)"మనుషుల మనస్సు కూడలి చుట్టూరా
విషాదాల కెరటాలు తాకినప్పుడల్లా
గాయాల సమూహాన్ని లేపనంతో మాన్పే
చేతులు కావాలి!"(పచ్చ సంతకం-పే.43)
2)జీవితానికి ఊరటనిచ్చే ఒక చల్లని మాటకోసం/
రాత్రిపగలెరుగక ఎదురుచూసే కళ్ళు తామరపూలు
రోజురోజుకూ ఆధునికజీవితం సంక్లిష్టమౌతున్న
కాలంలో ఈ కవి మనకోసం ఎదురుచూసే ఒక  మనిషిని కలగంటాడు.నాల్గు ఆత్మీయమైన మాటల కోసం నడక సాగిస్తుంటాడు.ఎంత డబ్బున్నా మనల్ని పలకరించే ఒక మనిషి లేకపోవడం ఎంతో విషాదం!.అందుకే ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని చూసి బైరాగిలా నవ్వుకుంటాడు.ఆ నవ్వులో బతుకు శాశ్వతం కాదని ,బతుకొక మాయ అని అనేక అర్థాలు ధ్వనిస్తాయి.

డా॥ ఆంజనేయులు ప్రకృతి కవి.ప్రకృతిని జీవితానికీ అన్వయించి చెప్పడం తన కవితల ప్రత్యేకత.జీవితం గురించి చెప్పినప్పుడల్లా చెట్టు,నది,పక్షి మొదలైన ప్రకృతిసంబంధమైన వాటితో పోలుస్తూ జీవితాన్ని విశ్లేషిస్తాడు.

"రాలిన ఆకులను చూసి
చెట్టువైపు జాలిగా చూడకు
చిగురుటాకులను చూసి వసంతోత్సవమని
అతి ఉత్సాహం చెందకు"
               (రాలిన ఆకులను చూసి -పే.35)

ప్రకృతిలోంచి జీవితాన్ని దర్శించడం,ప్రకృతిలోని ప్రతీ అణువణువు నుండి జీవితరహస్యాన్ని తెలుసుకోవడం చేస్తుంటాడు ఈ కవి.సంతోషంలో పొంగిపోవడం గానీ,దుఃఖంలో కుంగిపోవడం గానీ చేయకుండా సాధారణ జీవితాన్ని గడపాలనే తత్వం కనబడుతుంది.
"విషాదంలోనూ హాయిగా ఉంది" అని ఈ కవి అనడం వెనుక జీవితాన్ని లోతుగా దర్శించిన అనుభవం కనబడుతుంది.
సాహిత్యంలో చాలా వరకు నదిని,చెట్టును త్యాగానికి ప్రతీకగ తీసుకున్నారు."త్యాగభావమునకు తరువులే గురువులు "లాంటి పద్యపాదాలు అందుకు ఉదాహరణ. వీటిని చూసి పరోపకారగుణం నేర్చుకోవాలని బోధించారు.ఆంజనేయులు కూడా ప్రకృతిలోని త్యాగగుణం మనిషికి ఉండాలని ఆకాంక్షించాడు.సంకుచితత్వం వీడి విశాలత వైపు అడుగులు వేయమంటాడు.నలుగురికి సహాయం చేయడంలోనే జీవనసౌందర్యం దాగివుందనే సత్యం తన కవితల అంతస్సారం. ఆదివాసిల కోసం ప్రాణాలర్పించిన కొమరం భీం,దోపిడి విధానాలను ఎదిరించిన ఐలమ్మను, తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల త్యాగాలను కీర్తిస్తాడు.

మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న వాటిల్లో డబ్బు ఒకటి.
డబ్బు మనిషికి విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చింది.అలాగే  మనిషితనం లేకుండా చేసిన సందర్భాలూ అనేకం.
1)"డబ్బుంటే ఆకాశంతోటలో
నక్షత్రపుష్పాలనే కొని తెచ్చి
సిగలో తురుముకోవచ్చు" (మానవతా మణికిరీటం-పే.46)
2)మనుషులే కాదు సమస్తం సరుకుల అంగడి నేడు.

డబ్బుతో ముడిపడ్డ జీవితంలోని రెండు పార్శ్వాలు ఇక్కడ చూడొచ్చు.డబ్బు ద్వారా ప్రతిదీ సాధ్యమౌతుందని ,డబ్బు చుట్టు తిరుగుతూ అంగడిసరుకుగా మారిపోయాడనే విషయం స్పష్టంగ చూసిస్తాడు.
"జీవితం రంగులపక్షి "అంటాడు డా॥ఆంజనేయులు.పిట్టబతుకుకు,మనిషి బతుకుకు ఎంతో తేడా.ఎన్ని కోట్లు ఉన్నా మనిషి ఇంకా సంపాదించుకోవాలనుకుంటాడు.పక్షులు అట్లా కాదు.ఏరోజుకారోజు తృప్తిగా జీవిస్తాడు.ఏపూటకాపూట ఇంత దొరికితే చాలు అనుకునే తత్వం పిట్టది.ఒకరిని తొక్కి పైకి ఎదగాలనుకునే మనస్తత్వం మనిషిది.
అందుకే  ఈ కవి డబ్బు జీవితంలో భాగము మాత్రమే డబ్బే జీవితం కాదని చెబుతాడు.

సమాజం తీరుతెన్నుల గురించి గత ముప్పైయేండ్లుగా బోధిస్తున్న ఒక అధ్యాపకుడిగా,జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన ఒక సామాన్యుడిగా జీవితంలో ఎలా బ్రతకాలో తెలిపే బోధ సి.హెచ్ ఆంజనేయులు కవిత్వంలో కనబడుతుంది.
1)దీపమై వెలిగించుకో బతుకు చివరంచుదాకా
సాగిపోవాలనే విశ్వాసకవచాన్ని ధరిస్తే
ఆవలి అంతిమ శిఖరం ఎక్కి
    ( జీవనరుషి-పే.45)
2)మనిషెప్పుడూ నిలువనీరుగా నిలిచిపోరాదు
మనిషి నిరంతర గంగానదిలా సాగాలి

ఇవి యువతను లక్ష్యంవైపు నడిపించే వ్యక్తిత్వవికాస పాఠాలు.విచక్షణాఙ్ఞానాన్ని పెంపొందించి ఎంతో ప్రేరణనిస్తాయి.చదువులో జయాపజయాల కన్నా ఙ్ఞానసంపాదనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలంటాడు.ఇప్పుడున్న విద్యావిధానం ఎట్లుందో మనకు తెలియంది కాదు.టెక్నాలజి యుగంతో పోటీపడే వాళ్ళలో కూడా విషయపరిఙ్ఞానం తప్ప లోకఙ్ణానం తెలియని వాళ్ళూ ఉన్నారు.నైతికవిలువలు లోపించి తల్లిదండ్రులను హింహించే వాళ్ళూ ఉన్నారు.అలాగే ర్యాంకుల కోసం వెంపర్లాడే తల్లిదండ్రులు లేకపోలేదు.వీటన్నింటికి పరిష్కారం మన ఆలోచనావిధానంలో మార్పు రావడమే  .
"ఆశలగాలిపటాలు "కవిత్వసంపుటిలో రైతు జీవితాన్ని,తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే కవితలున్నా ఎక్కువభాగం తాత్వికతే కనబడుతుంది.బహుశా తన అనుభవం కూడా అందుకు కారణం కావొచ్చు.
ఇది వరకు డా॥సి.హెచ్ .ఆంజనేయులు అక్షరాలు పూస్తున్నాయి,గాయపడిన జాబిలి,దిగివచ్చిన గగనం అనే మూడు కవిత్వసంపుటాలు వెలువరించాడు."అనిసెట్టి అగ్నివీణ ఒక విశ్లేషణ" అనే సిద్ధాంత వ్యాసం రాశారు.'తెలంగాణ వచనకవిత్వం-ఒక విశ్లేషణ' అంశం మీద దాదాపు వెయ్యి పేజీల పరిశోధనగ్రంధం రాశారు.రాజకీయాలకు అతీతంగా తన పని తాను చేసుకుంటూ పోవడం మాత్రమే తెలిసిన కవి.నిరాడంబరంగా బతకాలని తన కవిత్వం ద్వారా చెప్పి బతుకుతున్న కవి.

-తగుళ్ళ గోపాల్ 9505056316

పుస్తకం వివరాలు
పేరు:ఆశల గాలిపటాలు
కవి:డా॥సి.హెచ్ ఆంజనేయులు
వెల:రూ.75
ప్రతులకు:పాలపిట్ట పుస్తకకేంద్రాలలో

Comments